బాబు నోట జాతీయ రాజ‌కీయాల మాట‌

Update: 2016-05-29 05:45 GMT
తెలుగుదేశం పార్టీ మ‌హానాడులో కీల‌క‌మైన అంశంగా నిలిచిన‌ ప్ర‌త్యేక హోదా త‌ర్వాత ఆస‌క్తిని రేకెత్తించిన అంశం బీజేపీతో టీడీపీ మితృత్వం. బీజేపీతో పొత్తుల గురించి చంద్ర‌బాబు మాట్లాడుతూ తెలుగుజాతి బాగు కోసం - రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఎన్‌ డీఏతో భాగస్వామ్యం అయ్యామని స్ప‌ష్టం చేశారు.'జాతీయ రాజకీయాలు - తెలుగుదేశం పాత్ర' అంశంపై చర్చలో సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు - తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం కేంద్రంలో ఎన్‌ డీఏ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యానికి చెక్‌ పెట్టేలా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు (నేషనల్‌ ఫ్రంట్‌ - యునైటెడ్‌ ఫ్రంట్‌) వచ్చాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించనుందని బాబు ప్ర‌క‌టించారు.

అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించే కొద్దీ తాను బుల్లెట్‌ లా దూసుకెళ్తానని చంద్రబాబునాయడు అన్నారు. ఈ సంద‌ర్భంగా వైఎస్‌ ఆర్‌ సీపీపై తనదైన శైలిలో బాబు విమర్శలు గుప్పించారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రతిపక్ష నేతకు తాను సమాధానం ఇయ్యాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో జగన్‌ పార్టీ త్వరలోనే కనుమరుగువుతుందని చెప్పారు. రైతులు తనను నమ్మి రాజధానికి 30 వేల ఎకరాలిస్తే నిర్మాణానికి ప్రతిపక్షనేత అడ్డ్డుపడటం దివాళా కోరుతనానిని నిదర్శనమన్నారు. రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపడుతూ కోర్టు కేసుల్లో వ్యాజ్యాలు వేస్తున్నారన్నారు. లిటికెంట్‌ దారులకు ఆర్ధికసాయం చేస్తున్న నాయకులు దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేయాలంటే కొందరు భూములివ్వనంటున్నారని ఆకాశంలో పరిశ్రమలు పెట్టాలేముకదా అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బుల్లెట్‌ లా దూసుకెళ్తామన్నారు.

టెక్నాలజీ సహకారంతో అవినీతి రహిత పాలన అందిస్తామని చంద్ర‌బాబు చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నీతి వంతమైన పాలన అందించడమే టీడీపీ ధ్యేయమన్నారు. రెవెన్యూలో 63 రకాల సర్టిఫికేట్లు ఇస్తున్నారని, దీని వల్ల ప్రతిచోటా అవినీతి జరుగుతోందని చెప్పారు. దీనివల్ల సర్టిఫికేట్ల అవసరాన్ని క్రమంగా తగ్గిస్తున్నామని తెలిపారు. ఒకే ద్రువీకరణ పత్ర విధానాన్ని తెస్తున్నామని చెప్పారు. మున్సిపాలిటీ - కార్మికశాఖ - పంచాయతీల్లో కూడా దీన్ని ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. ఇలా ఒక్క పైసా కూడా అవినీతి జరక్కుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో ఉండాల్సింది పోలీసులు కాదని, పోలీసింగ్‌ పటిష్టంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రం మొత్తం సీసీ కెమెరాలు పెట్టాలని, వాటి ద్వారా సంఘ విద్రోహ‌క‌ర శ‌క్తుల‌ను ప‌ట్టుకోవ‌చ్చ‌ని అన్నారు.
Tags:    

Similar News