అప్పుడు విశాఖ.. ఇప్పుడు నెల్లూరు

Update: 2015-11-22 08:03 GMT
విరుచుకుపడే విపత్తు సమయంలో అరకొరగా పని చేసే ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి.. వారి చేత పరుగులు పెట్టించాలంటే ఏం చేయాలి? బాధితులు ఉండేది ఒకచోట.. ప్రభుత్వ అధికారులు ఉండేది మరో చోట.. ఇక.. వారిద్దరి విషయాల్ని చూస్తూ.. సమీక్షలు జరిపేది ఇంకెక్కడో ఉండే ముఖ్యమంత్రి. అయితే.. ఇలాంటి తిరకాసు వ్యవహారాన్ని చాలా తేలిగ్గా మార్చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖను ఉక్కిరిబిక్కిరి చేసిన చండ.. ప్రచండ హుధూధ్ తుఫాన్ సమయంలో బాబు చేసిన సహాయక చర్యల్ని విశాఖ ప్రజలెవరో మర్చిపోలేరు.

స్వయంగా ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీసు ప్రాంగణంలో చెట్టుకింద వ్యాన్ ఉంచి.. అందులో నుంచి రోజుకు 20 గంటలు పైనే తాను పని చేస్తూ.. తన చుట్టూ ఉన్న అధికారుల చేత పని చేయించి ప్రశంసలు అందుకున్న చంద్రబాబు.. తాజాగా అదే సూత్రాన్ని నెల్లూరులోనూ అప్లై చేస్తున్నారు. దాదాపు ఏడాదికి సరిపడే వర్షం కేవలం వారం వ్యవధిలో పడిన నేపథ్యంలో.. దారుణ నష్టానికి గురైన నెల్లూరును తిరిగి యథాతధ స్థితికి తీసుకొచ్చేందుకు బాబు విపరీతంగా శ్రమిస్తున్నారు.

గత రెండు రోజులుగా నెల్లూరులోనే ఉన్న ఆయన అధికారుల్ని.. రాజకీయ నాయకుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. బాధితులకు సహాయక చర్యలు అందేందుకు వీలుగా ఆయన విపరీతంగా కష్టపడుతున్నారు. భారీ వర్షాల కారణంగా దారుణంగా దెబ్బ తిన్న నెల్లూరును కోలుకునేలా చేసేందుకు ఆయన భారీ ఎత్తున పనులు చేపడుతున్నారు.

ఐఏఎస్ అధికారుల్ని భారీగా జిల్లాకు తీసుకురావటమే కాదు.. ప్రతి ఐదు గ్రామాలకు సంబంధించిన వ్యవహారాల్ని చూసే బాధ్యతను అప్పగించారు. 30 మంది ఐఏఎస్ అధికారుల్ని నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి.. వారి నేతృత్వంలో అధికార గణాన్ని సహాయక చర్యలకు దించారు. భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలోని 22 మండలాల్లోని 500 గ్రామాలకు నష్టం వాటిల్లింది. వాటి సంగతి తేల్చేందుకు వీలుగా.. భారీగా నష్టపోయిన గ్రామాలకు 30 మంది ఐఏఎస్ అధికారుల్ని పంపారు.

దీనికి తోడు.. పార్టీ నేతల్ని సహాయక చర్యల్ని రంగంలోకి దింపారు. నిజానికి చంద్రబాబు వచ్చేంతవరకూ నెల్లూరు జిల్లాలో సహాయక చర్యలు పెద్దగా షురూ కాలేదనే చెప్పాలి. ఆయన రంగంలోకి దిగిన తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు స్పందించాల్సిన నేతలు.. నీరసంగా ఉండటం.. పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం బాబుకు అగ్రహాన్ని కలిగించింది. ఆయన కోపాన్ని చూసిన నేతల్లో ఒక్కసారిగా కదలిక మొదలైంది. ఈ కారణాలతోనే.. తానుకానీ నెల్లూరు జిల్లాను వదిలి వెళితే పనులు పూర్తి కావన్న విషయాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు.. నెల్లూరులో మకాం పెట్టి.. సహాయక కార్యక్రమాల్ని స్వయంగా సమీక్షిస్తున్నారు. విశాఖలో విపత్తును అధిగమించిన తీరులోనే.. నెల్లూరులోనూ అధిగమిస్తామన్న నమ్మకాన్ని బాబు అండ్ కో వ్యక్తం చేస్తోంది.
Tags:    

Similar News