సొంత జిల్లాలో కుంప‌టి రాజేస్తున్న బాబు

Update: 2016-11-23 18:30 GMT
ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో నిర‌స‌న‌ల బాట ప‌ట్టేందుకు కార‌ణం అవుతోంది. ఏపీలో పెట్టుబ‌డుల కేంద్రంగా మారిన శ్రీ సిటీ విష‌యంలో ఈ ఆందోళ‌న‌లు ప్రారంభం అవుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పరిధిలోని సత్యవేడు - వరదయ్యపాళెం మండలాల పరిధిలోని 11 గ్రామాలను నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) పరిధిలోకి తీసుకెళ్తూ ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని వెనుక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు - రాష్ట్ర మంత్రి నారాయణ ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని సెజ్‌ గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే ఆందోళనకు దిగుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని సత్యవేడు - వరదయ్యపాళెం మండలాల పరిధిలో శ్రీ సిటీని ఏర్పాటు చేశారు. శ్రీ సిటీలో ఇప్పటివరకు 26 దేశాలకు చెందిన 135 పరిశ్రమలను ఏర్పాటు చేశారు. వీటిలో 85 పరిశ్రమలు ఉత్పత్తులూ ప్రారంభించాయి. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన యువతకు ఉద్యోగావకాశాలూ లభిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లా వాసుల్లో స‌హ‌జంగానే సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంపై వారు మండిప‌డుతున్నారు. సెజ్‌ పరిధిలోని సత్యవేడు మండలంలో అప్పయ్యపాళెం - ఆరూరు - చెంగంబాకం - చెరివి - గొల్లవారిపాళెం - ఇరుగుళం - మల్లవారిపాళెం - వరదయ్యపాళెం మండలంలోని చిలమత్తూరు - మోపూరుపల్లి - సిద్ధమగ్రహారం - తొండూరు గ్రామాలు నెల్లూరు అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (నుడా) పరిధిలోకి క‌లిపేశారు.ఈ మేర‌కు తాజాగా ఈ నోటిఫికేషన్‌ నూ జారీ చేశారు. ఈ ప‌రిణామంతోనే షాక్ తిన్న స్థానికులు నుడా పరిధిలోకి శ్రీసిటీ పరిధిలోని 11 గ్రామాలను మాత్రమే తీసుకుని మిగిలిన గ్రామాలను ఆ పరిధిలో చేర్చకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే స్థానికుల్లో ఒకింత అసంతృప్తి ఉంది. శ్రీ సిటీ కోసం భూములిచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, అప్పట్లో నిర్వాహకులు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీలు నేటికీ నెరవేరలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ - స్వీపరు వంటి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని బాధిత రైతు కుటుంబాలు వాపోతున్నాయి. నెల్లూరు - చెన్నై వాసులకు పెద్ద జీతాలు - హోదాలున్నా వారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి విడిపోతున్న ఈ 11 గ్రామాల ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లాల్సి ఉంటుంద‌ని ఇది త‌మ‌కు ఎంత ఇబ్బందిక‌ర‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో సెజ్‌ సిటీ గ్రామాలను నెల్లూరు నుడాలో కలుపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనకు దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. వెర‌సి బాబు సొంత జిల్లాలోనే వివాదాన్ని స్వ‌యంగా సృష్టించికున్న‌ట్లు అవుతుంద‌ని పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News