డైన్ విత్ చంద్రబాబు : శుభంకార్డు పడ్డట్టే!

Update: 2018-02-02 08:16 GMT
నగల దుకాణాల దగ్గరినుంచి డిటర్జెంటు సోపులు అమ్ముకునే వ్యాపారుల వరకూ.. తమ మార్కెటింగ్ కోసం రకరకాల టెక్నిక్కులు అవలంబిస్తూ ఉంటారు. సినిమా సెలబ్రిటీలతో కాంట్రాక్టు మాట్లాడుకుని.. తమ ఉత్పత్తులు కొని లాటరీలో ఎంపికైన వారికి ఆ సినీ సెలబ్రిటీతో కలిసి డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తాం అంటూ మిక్కిలిగా ప్రచారం చేస్తారు. ఇది సాధారణంగా ప్రతి సారీ వర్కవుట్ అయ్యే మార్కెటింగ్ టెక్నిక్. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి టెక్నిక్ నే ఫాలో కాబోతున్నది. ఆ పార్టీకి సంబంధించినంత వరకు చంద్రబాబునాయుడు మినహా మరో సెలబ్రిటీ ఉండరు గనుక.. ‘డైన్ విత్ చంద్రబాబు’ అనే సరికొత్త పథకం.. పార్టీ ఎమ్మెల్యేల కోసం రూపుదిద్దుకుంటున్నదిట. పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. నియోజకవర్గాల్లో జరిపే సర్వేల ద్వారా... సేకరించే ప్రజాభిప్రాయాల ద్వారా వడపోత అనంతరం ఎంపికచేసిన అతికొద్దిమంది అనగా సుమారు 30-40 మంది పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ మహదవకాశం లభిస్తుందిట. ఫ్యామిలీతో సహా వారిని చంద్రబాబునాయుడు తో కలిసి భోజనం చేయడానికి ఆహ్వానిస్తారుట!

భోజనం తర్వాత ఇంకేం గిఫ్టులు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు కదా...? అవును- భోజనం తర్వాత గిఫ్టు కూడా తప్పక ఉంది. మీ నియోజకవర్గంలో మీ పనితీరు బాగాలేదు.. మీకు ఈసారి టిక్కెట్ ఇవ్వడం కుదరదు.. మనం మంచి పార్టీ కార్యకర్తల్లాగా పార్టీకోసం పనిచేద్దాం అని హితబోధ చేసి.. వీడ్కోలు చెబుతారట. పార్టీ అధినేత తాజా ఆలోచన ఇదీ అని చెబుతున్నారు.

సర్వేల మీద మాత్రమే ఆధారపడి అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే అలవాటున్న చంద్రబాబునాయుడు పనితీరు సరిగా లేదని తేలిన 40 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారట. ఓ పదిమందిలో మాత్రం ఆయనకు మార్పు కనిపించిందని, మిగిలిన 30 మందికి శుభం  కార్డు వేసేయడానికి ఆయన ‘డైన్ విత్ చంద్రబాబు’ ఆఫర్ రెడీ చేశారని పార్టీలో జోకులేసుకుంటున్నారు. చంద్రబాబును.. ‘‘ఓసారి భోజనానికి వస్తారా’’ అనే ఫోన్ కాల్ ఏ క్షణాన వస్తుందో.. తమ రాజకీయ జీవితానికి ఎలా తెరపడిపోనున్నదో.. అని ఎమ్మెల్యేల్లో వణుకు పుడుతున్నదిట.

మహాభారతంలో ధృతరాష్ట్ర కౌగిలి అని ఓ ప్రస్తావన ఉంది. కురుక్షేత్రం ముగిశాక వేదనలో ఉన్న ధృతరాష్ట్రుడు – ఓసారి కౌగిలించుకోవాలని ఉందని భీముణ్ని దగ్గరకు పిలిచాడట. వెళ్లబోతున్న భీముణ్ని వారించి.. ఓ ఉక్కు ప్రతిమను ఆయన ఎదుట నిలబెట్టాడు కృష్ణుడు. తన కొడుకును కడతేర్చాడని కోపంతో ఉన్న ధృతరాష్ట్రుడు ఆ బొమ్మను కౌగిలించుకునేసరికి అదికాస్తా పొడిపొడిగా అయిపోయిందిట. అంటే ధృతరాష్ట్ర కౌగిలి అంటే ప్రేమగా కౌగిలించుకున్నట్టే కనిపించినా.. సర్వనాశనం చేసేస్తుందని అర్థం. ఇప్పడు చంద్రబాబు తో డిన్నర్ అన్నా కూడా అదే రకంగా.. రాజకీయ జీవితానికి తెర వేసేసినట్లే అని పార్టీ వారే భయపడుతున్నారట.
Tags:    

Similar News