నీతులు చెప్పి కేసీఆర్‌ నే ఫాలో అవుతున్న బాబు

Update: 2017-04-02 06:03 GMT
తెల‌గుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడ‌పై కొత్త చ‌ర్చ మొద‌లైంది. 30 ఏళ్ల  అనుభ‌వం, రాజ‌కీయాల‌కు విలువ‌లు నేర్పింది త‌నే అని చెప్పుకొనే బాబు తాజాగా నీతులు చెప్పే మ‌నిషి మాత్ర‌మే కానీ, వాటిని చేత‌ల్లో చూపే నాయ‌కుడు కాద‌నే అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తోంది. ఇదంతా ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ గురించి! అందులో జంప్ జిలానీల‌కు చాన్స్ క‌ల్పించ‌డం గురించి.!!

తాజాగా జ‌రిగిన‌ మంత్రివర్గ విస్తరణలో జంప్ జిలానీల‌కు చంద్ర‌బాబు బెర్తులు ఇచ్చారు. జంప్ జిలానీల్లో చిత్తూరు జిల్లా నుండి అమర్ నాథరెడ్డి, కడప నుండి ఆదినారాయణరెడ్డి, కర్నూలు నుండి భూమా అఖిలప్రియారెడ్డి, విజయనగరం నుండి సుజయ కృష్ణ రంగారావు, కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డికి అవ‌కాశం క‌ల్పించారు. ఈ ప‌రిణామ‌మే టీడీపీ వ‌ర్గాల‌కు మింగుడుప‌డ‌కుండా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సనత్‌ నగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్, తర్వాత టీఆర్ ఎస్‌ లో చేరి మంత్రిగా ప్రమాణం చేశారు. దానికంటే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను స్పీకర్‌ కు అందించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో విమర్శలు కురిపించిన తెలుగుదేశం పార్టీ, గవర్నర్ చర్యను తీవ్రంగా ఆక్షేపించింది. గవర్నర్ రాజ్యాంగ ధర్మాన్ని నెరవేర్చకుండా, ప్రభుత్వం చెప్పిన మాట విన్నారంటూ ధ్వజమెత్తింది. వేరే పార్టీ ఎమ్మెల్యేతో ఏవిధంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారని నిలదీసింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో చివరకు చంద్రబాబునాయుడు కూడా తలసాని చర్య అనైతికమని, మనం టికెట్టిస్తే గెలిచిన తలసానికి టీఆర్‌ఎస్ మంత్రి పదవి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.

తెలంగాణ టీడీపీ నేతలు ఇప్పటికీ తలసాని వ్యవహారాన్ని అనైతికమంటూ తప్పుపడుతూనే ఉన్నారు. తెలంగాణలో తలసానితో రాజీనామా చేయించకుండానే మంత్రి ఇవ్వడాన్ని అనైతిక చర్యగా గవర్నర్‌ను విమర్శించి, ఇప్పుడు ఏపీలోఅదే పనిచేయ‌డంపై టీడీపీ శ్రేణులే షాక్ తింటున్నాయి. ఒకవైపు నైతిక విలువల గురించి మాట్లాడుతూ, మరోవైపు తామూ అదే అనైతిక చర్యలకు పాల్పడితే తటస్థులు, విద్యావంతుల్లో చంద్రబాబునాయుడు ఇమేజ్ దెబ్బతిన‌కుండా మ‌రేం అవుతుంద‌ని తెలుగుత‌మ్ముళ్లు అంటున్నారు. మొత్తంగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తీసివేతలు, కూడికలతో కసరత్తు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి నైతిక అంశం సంకటంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News