అందరినోట ట్యాప్‌ చేయలేదన్న మాటే..?

Update: 2015-06-08 14:04 GMT
ఓటుకు నోటు యవ్వారంలో వీడియో క్లిప్పింగ్‌ తో రేవంత్‌ రెడ్డిని అడ్డంగా బుక్‌ చేసిన నాటి నుంచి తెలంగాణ అధికారపక్షం వీర ఉత్సాహంతో విరుచుకుపడటం తెలిసిందే. ఆ ఊపులోనే ఏపీ సీఎం చంద్రబాబు టేపులు కూడా ఉన్నట్లుగా వెల్లడించి.. మరో సంచలనానికి తాము సిద్ధమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

బాబు టేపులు ఉండటం అసాధ్యమన్న అంచనాతో.. ఏపీ అధికారపక్షం కాస్తంత ధీటుగానే ప్రతిస్పందించింది. ఇలాంటి సమయంలోనే బాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపును ఛానల్‌ కు రిలీజ్‌ చేశారు. అప్పటివరకూ కథ బాగానే నడిచినా.. ఒక్కసారి సీన్‌ కాస్త తేడా కొట్టిన పరిస్థితి. బాబు ఆడియో టేపు బయటకు రావటం.. వెనువెంటనే ఏపీ సీఎం ఫోన్‌ ను ట్యాప్‌ చేసినట్లుగా ఏపీ అధికారపక్షం తెరపైకి తీసుకురావటంతో ఒక్కసారి పరిస్థితులో మార్పు వచ్చింది.

రేవంత్‌ వీడియో క్లిప్పింగ్‌ బయటకు వచ్చిన సమయంలో ఏర్పడ్డ సానుకూలత.. చంద్రబాబు ఆడియో (?) క్లిప్పింగ్‌ విషయంలో లేకపోగా.. రివర్స్‌ గేర్‌ లో ప్రతికూల పరిస్థితి ఏర్పడటం.. సీఎం ఫోన్‌ నే ట్యాప్‌ చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షంతో పాటు.. కేసుల నమోదుకు రంగం సిద్ధం అయిపోయిన పరిస్థితి.

ఇదే సమయంలో.. ఆడియోక్లిప్పింగ్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని చెప్పలేక.. మింగాలేక కక్కాలేని పరిస్థితి. అంతే.. అప్పటివరకూ బాబు ఆడియోను బయటపెట్టి తాము సక్సెస్‌ అయ్యామన్న సంతోషం నుంచి.. బుక్‌ అయ్యామేమోనన్న సందేహం వచ్చిన పరిస్థితి. ఈ కారణం చేతనే.. సోమవారం ఉదయం నుంచి మాట్లాడుతున్న తెలంగాణ అధికారపక్షం నేతలు ఏపీ సీఎం ఫోన్లను ట్యాప్‌ చేయాల్సిన అవసరం తమకు లేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా.. విమర్శలు చేసినా.. అంతిమంగా ఏపీ సీఎం ఫోన్‌ ట్యాపింగ్‌ అవసరం తమకు లేదన్న విషయాన్ని ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించటం చూసినప్పుడు.. ఆడియో టేపు లెక్కలో ఎక్కడో ఏదో తేడా కొడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News