బాబు క‌న్ను మైనార్టీలపై ప‌డింది

Update: 2017-02-02 07:13 GMT
బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కారుకు పెద్ద ఎత్తున మద్ద‌తిస్తున్న నేప‌థ్యంలో మైనార్టీ వ‌ర్గాల నుంచి స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా  రాష్ట్రంలో అమలవుతున్న  మైనార్టీ సంక్షేమ పథకాలపై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించ‌డం. ఈ సంద‌ర్భంగా అభ్య‌ర్థిస్తున్న‌ట్లుగా బాబు మాట్లాడ‌టం ఇందుకు ఆజ్యం పోస్తోంది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అవగాహన సదస్సులో చంద్ర‌బాబు ప్రసంగించారు.తెలుగుదేశం పార్టీకి - ముస్లింలకు మధ్య ఉన్న అపోహలు తొలగించడానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. నాలుగు శాతం రిజర్వేషన్లు కాపాడుతానని భరోసా ఇచ్చారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికే ఎన్‌ డిఎతో పొత్తు పెట్టుకున్నానని - ముస్లింల సంక్షేమం - అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు చెప్పారు. ముస్లింలారా నన్ను నమ్మండి. ఆర్థికంగా - రాజకీయంగా - సామాజికంగా మీ భద్రత విషయంలో న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు. త్వరలో ముస్లింల కోసం మరో 25 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

ఈ ఏడాది నుంచే హజ్ యాత్రికులను విజయవాడ నుంచి జెడ్డా పంపడానికి గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ ను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చంద్ర‌బాబు చెప్పారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని హామీ నిచ్చారు. కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీ ప్రారంభించామ‌ని, కడపలో, విజయవాడలో హజ్ భవనాలు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. వక్ఫ్ బోర్డును పటిష్టపరచడమే కాదు, వక్ఫ్ ఆస్తుల్ని మైనార్టీల ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తామని చెప్పారు. మత సామరస్యానికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్‌ ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. వక్ఫ్ బోర్డు ద్వారా 24 కోట్లు విడుదల చేశామ‌ని, మొత్తం 5 వేల మంది ఇమాంలు, 5 వేల మంది వౌజన్‌ లకు చెక్కులను అందజేయనున్నామ‌ని తెలిపారు. మొదటి విడతగా రెండు వేల 500 మందికి ఇస్తున్నారు. రెండు విడతలో మరో రెండు వేల 500 మందికి గౌరవ భత్యం ఇస్తున్నామన్నారు. దేశ సమైక్యత, సమగ్రత, మతసామరస్యం కోసం ప్రార్థనలు చేయాలంటూ పిలుపునిచ్చారు.  పచ్చటి టోపీ, పచ్చటి షేక్ దుస్తుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కనిపించారు. రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రచురితమైన ఎపి హజ్ బులెటిన్ పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా విడుదల చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News