వాట్సప్‌ ఉవాచ: మోడీ 'మనీ' ప్యాకేజీ అనగా...

Update: 2015-10-27 17:30 GMT
‘‘అంతన్నా డింతన్నాడే గంగరాజు.. ముంతమామిడి పండన్నాడే గంగరాజు 
అస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు.. నన్నొగ్గీసె ల్పొయినాడే గంగరాజు’’ అంటూ సాగే జానపద పాట నరేంద్రమోడీ అమరావతి పర్యటనకు అతికినట్లుగా సరిపోతుందేమో. అందుకే ఆయన మీద ఇప్పుడు తెలుగు ప్రజలు విపరీతమైన జోకుల ద్వారా తమ ఆవేశాన్ని కక్కుతున్నారు.

కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్లుగా తయారైపోయింది.. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ.. రావడమూ పోవడమూ కూడా! మోడీ వచ్చేశాడు.. ఏం వరాలు ప్రకటిస్తాడో ఏమో.. మన రాష్ట్రానికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో అని రాష్ట్ర వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయి.. నిరీక్షించిన ప్రజానీకం ఈసురోమనిపోయింది. అందరినీ తెగ నిరాశ పరచి వెళ్లిపోయిన మోడీ వైఖరిపై ఆన్‌ లైన్‌ సోషల్‌ మీడియా మాత్రం.. ఒక రేంజిలో చెలరేగిపోతోంది. మోడీ చేసిన వంచన గురించి యువతరం రూపొందించిన రకరకాల సెటైర్లు -  జోకులు - కార్టూన్లు - ఫోటో కామెంట్లు విచ్చలవిడిగా సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ లలో చెలామణీ అవుతున్నాయి.

అలాంటి అనేకానేక సెటైర్లలో చాలా పాప్యులర్‌ గా వాట్సప్‌ ద్వారా ప్రచారంలో ఉన్న ఇది కూడా ఒకటి. దీన్ని చదివితే చాలు.. మనకు మోడీ తత్వం ఎలాంటిదో.. ఆయన గురించి దీన్ని తయారుచేసిన వారికి ఎలాంటి అభిప్రాయం ఉన్నదో కూడా అర్థమైపోతుంది.
==========
చంద్రబాబు అలసటగా పక్క మీద వాలగానే ఫోన్‌ మోగింది. చిరాగ్గా ఫోన్‌ అందుకున్నాడు.

‘హలో, చంద్రబాబూజీ! నేను నరేంద్ర మోదీని...’ అవతలనించి వినిపించింది.

చంద్రబాబు అలర్ట్‌ అయ్యాడు.

‘నమస్తే సార్‌... ఏంటి సార్‌ ఇంతరాత్రప్పుడు ఫోన్‌ చేశారు? ఇంకా పడుకోలేదా?’

‘ఇప్పుడే ట్విట్టర్లో అమరావతి శంకుస్థాపన గురించి నాలుగు ముక్కలు గీకి నీకు ఫోన్‌ చేస్తున్నా చంద్రబాబూ! ఏమంటున్నారు మీ జనాలు నా స్పీచి గురించి’ కుతూహలంగా అడిగాడు మోదీ.

‘‘అసలు ముందు ఈ విషయం తేల్చండి.. రెండ్రోజుల కిందట ఫోన్‌ చేసినప్పుడు ‘మీ కోసం మనీ ప్యాకేజ్‌ తెస్తున్నానూ, అప్పుడే ఎవరికీ చెప్పొద్దూ’ అన్నారా, లేదా? మరి తేలేదేం?’’ నిష్టూరంగా అడిగాడు చంద్రబాబు.
మోదీ ఫెళ్లున నవ్వాడు.

‘నేను ఢిల్లీ నించి తెచ్చిన మనీ ప్యాకేజ్‌ స్టేజి మీదే నీ చేతుల్లో పెట్టాకదా చంద్రబాబూ! మర్చి పోయావా?’
చంద్రబాబు తికమక పడ్డాడు. ‘స్టేజిమీద నాకేం ఇచ్చారూ, నా బొంద.. మట్టీ, నీళ్లూ తప్ప..’ అన్నాడు.
మోదీ మళ్లీ పడీపడీ నవ్వాడు. ‘‘మరదేనయ్యా మగడా! ‘మ’ అంటే మట్టి, ‘నీ’ అంటే నీళ్లు... టోటల్‌గా మనీ ప్యాకేజ్‌ అంటే అదే మరి!’

Tags:    

Similar News