బాబు ఎన్ని 'కల' లో !

Update: 2019-01-22 06:12 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వరాలు గుప్పిస్తున్నారు. మహిళలను - యువతను - రైతులను ఆకట్టుకునేందుకు ఎన్నికల వరాలను ప్రకటిస్తున్నారు.  డ్వాక్రా మహిళలకు సెల్‌ ఫోన్లు - రైతులకు రైతు రక్ష - నిరుద్యోగ భృతి ట్రాక్టర్లు - ఆటోలకు ప‌న్ను మిన‌హాయింపు వంటి పథకాలతో ఏపీ ఓటర్లును ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గడచిన నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలు కాని - ప్రజలను ఆకట్టుకునే పథకాలు కాని ప్రవేశపెట్టని చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తున్నారని అంటున్నారు. మరో మూడు లేక నాలుగు నెలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు - లోక్‌ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తిరిగి అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడికి అనివార్యం. ఓటుకు నోటు కేసుతో పాటు పలు కేసులున్న చంద్రబాబు నాయుడు వాటి నుంచి బయటపడేందుకు ఈ ఎన్నికలలో గెలుపు అనివార్యంగా భావిస్తున్నారు. దీంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ - ప్రభుత్వ పరంగా నిర్వహించిన సర్వేలలో ఈసారి అధికారంలోకి రావడం కష్టమని తేలింది. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేకతకు కారణం అయ్యిందని అంటున్నారు. ఈ తరుణంలో ఏపీలో గెలిచి తీరాలని చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాగైన విజయం సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ లో వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు పలు పథకాలు ప్రకటిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే గడచిన నాలుగేళ్లుగా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టని చంద్రబాబు నాయుడకు కొత్త పథకాలు ఎన్ని "కల"లుగానే మిగిలిపోతాయని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా నవరత్నాలు పథకాలకు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రకటించే పథకాలు అన్నీ ఎన్నికల జిమ్మిక్కుగానే ఓటర్లు పరిగణిస్తారని చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు జ‌గ‌న్ 2 వేలు పింఛ‌ను జ‌నాల్లోకి వెళ్లాక బాబు ఇచ్చినా కూడా బాబుకు ఆ క్రెడిట్ రావ‌డం లేదు. కాంగ్రెస్‌ తో కలసి ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడుకు ఆ నిర్ణయమే గుదిబండగా మారుతుందని విశ్లేషిస్తున్నారు.


Full View

Tags:    

Similar News