బాబు రాక‌ కోసం ఢిల్లీ రెడీ అయింది

Update: 2019-02-08 17:30 GMT
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఢిల్లీ వేదిక‌గా గళం విప్ప‌నున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనీ - విభజన చట్టం హామీలు అమలు చేయాలని కోరూతూ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 11 న ఢిల్లీలోని  ఏపీ భవన్ వేదికగా  ధర్మపోరాట దీక్ష చేపట్టనున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా  అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చంద్రబాబు దీక్షకు బీజేపీ యేతర విపక్ష పార్టీలకు చెందిన పలువురు జాతీయ స్ధాయి నేతలు ఏపీ భవన్ కు వచ్చి మద్దతు తెలపనున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈదీక్షకు మద్దతుగా పలు ఎన్జీవో సంఘాలను - అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వస్తోంది.

సీఎం చంద్ర‌బాబు దీక్ష నేప‌థ్యంలో ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీలో భారీగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష పోస్టర్లు వెలిశాయి. అశోక రోడ్ - మాన్ సింగ్ రోడ్ - రఫి మార్గ్ - జన్‌ పథ్‌ లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు చంద్రబాబు దీక్ష చేస్తారు. దీక్ష కోసం కోటి 12 లక్షల రూపాయల ఖర్చుతో  ఏపీ ప్రభుత్వం 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఒక్కో రైలులో 20 బోగీలు ఉన్నాయి. శ్రీకాకుళం - అనంతపురం జిల్లాల నుంచి ఈ రైళ్లు ఇప్పటికే  ఢిల్లీ బయలు దేరాయి. ఆదివారం ఉదయం 12 గంటలకు రైళ్లు ఢిల్లీ చేరుతాయి. ఆ మ‌రుస‌టి రోజు చంద్ర‌బాబు దీక్ష ఉండ‌నుంది.

ఇదిలాఉండ‌గా, ఏపీకి ప్ర‌త్యేక  హోదాకు మ‌ద్ద‌తిస్తున్న పార్టీలు - విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని కోరుతున్న ఆయా పార్టీల నేత‌లు ఈ దీక్ష‌కు వ‌చ్చి మ‌ద్ద‌తు తెల‌పనున్న‌ట్లు స‌మాచారం. బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలోని పార్టీల ప్ర‌తి ఒక్క నేత ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఏపీ కోసం త‌మ సంఘీభావాన్ని తెలియ‌జేయ‌నున్నారు.
   

Tags:    

Similar News