లిస్టులో కనిపించని జమిలి బిల్లు.. అలా ఎందుకు?
తాజాగా జమిలి ఎన్నికల మీద మోడీ సర్కారు గురి పెట్టింది. ఒక దేశం.. ఒకే ఎన్నికల పేరుతో జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ గడిచిన కొన్నేళ్లుగా సాగుతోంది.
సంచలన నిర్ణయాల్ని.. దశాబ్దాల తరబడి చర్చ మాత్రమే జరిగి.. అమలు విషయంలో అంతులేని ఆలస్యాన్ని ఎదుర్కొనే ఎన్నో అంశాల్ని ఒక కొలిక్కి తెచ్చిన ఘనత మోడీ సర్కారుకు లభిస్తుంది. తాజాగా జమిలి ఎన్నికల మీద మోడీ సర్కారు గురి పెట్టింది. ఒక దేశం.. ఒకే ఎన్నికల పేరుతో జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ గడిచిన కొన్నేళ్లుగా సాగుతోంది. దీనిపై ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చిన మోడీ సర్కారు.. ఇటీవల నిర్వహించిన కేంద్ర మంత్రివర్గంలో ఈ బిల్లును ఆమోదించిన వైనం తెలిసిందే.
తర్వాతి అడుగులో భాగంగా తాజాగా నిర్వహిస్తున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెడతారన్న ప్రచారం జోరుగా సాగింది. అందుకు ఈ రోజు సభలో ఈ బిల్లు వస్తుందని భావించారు. అనూహ్యంగా మోడీ సర్కారు ఈ బిల్లుపై వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే సోమవారం లోక్ సభలో చర్చించే అంశాలకు సంబంధించిన జాబితాను చూస్తే.. అందులో జమిలి బిల్లు అంశం కనిపించకపోవటం ఆసక్తికరంగా మారింది.
ఒకసారి డిసైడ్ అయితే ఎంతకైనా వెళ్లి.. తాను అనుకున్నది పూర్తి చేసే అలవాటున్న మోడీ సర్కారు.. జమిలి ఎన్నికల బిల్లు విషయంలో పునరాలోచనలో పడ్డారా? వెనక్కి తగ్గారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. వ్యూహాత్మకంగానే వెనకుడుగు వేసినట్లుగా ఒక వర్గం వాదిస్తుంటే.. అదేమీ లేదు.. జమిలి బిల్లును లిస్టు చేయకుండా.. స్పీకర్ అనుమతితో సభలో ప్రవేశ పెట్టే వీలుందని చెబుతున్నారు.
మరోవైపు జమిలి ఎన్నికల్ని కొన్ని జాతీయ పార్టీలు.. బలమైన ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వాతావరణంలోఆర్థిక కార్యకలాపాల బిల్లులపై ఆమోద ముద్ర వేసుకోవటం చాలా అవసరం. అందుకే.. ఆ బిల్లుల అంశం క్లియర్ అయ్యే వరకు జమిలి ఎన్నికల్ని పక్కాన పెట్టే వ్యూహంలో మోడీ సర్కారు ఉందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా జమిలి ఎన్నికల బిల్లు తాత్కాలికంగా ఆగినా.. దాన్ని ఎక్కువ కాలం ఆపే ఉద్దేశంలో మోడీ సర్కారు లేదని చెబుతున్నారు.