బాబు ఆహ్వానం...విజ‌య‌వాడ‌కు కేసీఆర్!

Update: 2016-12-28 04:51 GMT
శీతాకాల విడిది కోసం రాజధానికి వచ్చిన భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గౌరవార్థం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ ఎల్‌ నరసింహన్‌ రాజ్‌ భవన్‌ లో ఇచ్చిన విందు సంద‌ర్భంగా చాలాకాలం తర్వాత ఇద్దరు చంద్రులు కలిశారు.  ఈ విందు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు - చంద్రబాబు నాయుడులు దాదాపు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చించారు.ఈ సంద‌ర్భంగా ఏపీ ప‌రిపాల‌న రాజధాని విజ‌య‌వాడ‌కు రావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను చంద్ర‌బాబు ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం.

జనవరి 3వ తేదీన విజయవాడకు సమీపంలో ఎన్‌ డిఆర్‌ ఐ బెటాలియన్‌ శంకుస్థాపన జరుగుతోందని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ - పట్టణాభివృద్ధి - సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా వస్తున్నారని, మీరు కూడా ఈ కార్యక్రమానికి వస్తే బాగుంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను చంద్రబాబు ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను త్వ‌ర‌లో తాను పంపిస్తానని, ఖచ్చితంగా హాజరు కావాలని కేసీఆర్‌ ను కోరినట్టు తెలుస్తోంది. పరిస్థితిని బట్టి - ఎటువంటి కార్యక్రమాలు లేని పక్షంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతానని చంద్రబాబుకు కేసీఆర్‌ భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలాఉండ‌గా పెద్దనోట్ల రద్దు తర్వాత జాతీయ స్థాయిలో నెలకొన్న పరిణామాలపై ఇరువురు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేశాక తెలుగు రాష్ట్రాల్లో రైతులు - సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నగదు రహిత లావాదేవీలు చేయాలని వివరిస్తున్నా ఆశిస్తున్న ప్రయోజనాలు చేకూరడం లేదని ఇరువురు సీఎంలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. డిజిటల్‌ లావాదేవీలను జరిపేందుకు ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఇరువురు తమ చర్చల సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం.

అదే స‌మ‌యంలో విభజన చట్టంలోని 9 - 10 షెడ్యూల్‌ లో ఉన్న సంస్థల విభజన - నిధుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ముందుకు వెళదామని - తనకు ఎటువంటి పట్టివిడుపులు లేవని చంద్రబాబు కేసీఆర్‌ తో అన్నట్టు ప్రచారం జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని సమావేశపరిచి సమస్యలపై ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి ఇరువురు సీఎంలు వచ్చినట్టు సమాచారం. ఇరువురం కలిసి పనిచేస్తే దేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రగ్రామిగా ఉంటాయని, ఈ దిశగా ముందుకు సాగుదామని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాలకు అందవలసిన కరెన్సీని రెట్టింపు చేసేందుకు తాను రిజర్వు బ్యాంకుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చానని, ఆంధ్రప్రదేశ్‌ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎక్కువ నోట్లను ఇవ్వాలని చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై కూడా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు ఇబ్బంది పడకుండా చర్చించుకుని ఒక నిర్ణయానికి వద్దామని ఇరువురు సీఎంలు ప్రతిపాదించారు. చర్చలకు తానెప్పుడూ సిద్ధమేనని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా వేసిన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News