టీడీపీలో పాజిటివ్ సర్వేల కోసం ప్రయత్నం

Update: 2019-02-17 01:30 GMT
ఎమ్మెల్యేల పనితీరుపై ఫోన్‌ కాల్స్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నిత్యం జరిపించే సర్వేలు ఎంత టార్చర్ పెడతాయో తెలిసిందే. ఈ ఫోన్ కాల్స్ అందుకునేవాళ్లది ఒక టార్చర్ అయితే.. అలా అందుకున్న వాళ్లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ సరిగా లేకపోతే సర్వేలో సరైన మార్కులు రాక నాయకులకు చంద్రబాబు తెగ టార్చర్. ఇవన్నీఒకెత్తయితే ఈ సర్వే ఫలితాల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలకు సొంత పార్టీలోని నేతలతో కష్టాలు మొదలవుతున్నాయట. సదరు ఎమ్మెల్యేలకు సర్వేలో తక్కువ మార్కులు వచ్చాయని.. ఈసారి టికెట్ రాదని ప్రచారం చేస్తూ తలనొప్పులు తెస్తున్నారట. ఈ రచ్చను తప్పించుకోవడానికో ఏమో కానీ టీడీపీ ఇప్పుడు సానుకూల సర్వే దిశగా అడుగులు వేస్తున్నట్లు టాక్. ఈ సర్వేల్లో చోటు చేసుకున్న ఓ కీలక మార్పే దానికి ఉదాహరణ.
   
ఇంతవరకు ఈ సర్వేల్లో.. ‘మీ నియజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. సంతృప్తి చెందితే 1 నొక్కండి.. లేదంటే 2 నొక్కండి’ అని వచ్చేది. దీంతో పదేపదే ఈ కాల్స్‌కు అలవాటైన వారిలో సంతృప్తి చెందినవారు 1 - సంతృప్తి లేనివారు 2 నంబర్‌ను యథాలాపంగా నొక్కేసేవారు. ఏమీ వినకుండానే ఈ సమాధానం ఇచ్చేవారు. అయితే..తాజాగా ఇప్పుడు ఈ ఆప్షన్లకు రెస్పాన్స్ నంబర్ మార్చారు. సంతృప్తి చెందితే 2.. అసంతృప్తిగా ఉంటే 3 నొక్కమని అడుగుతున్నారు. దీంతో గతంలో మాదిరిగా వినకుండా ఆన్సర్ చేసేవారు 2 నొక్కితే అది సంతృప్తి చెందినట్లుగా ఫీడ్ బ్యాక్ వెళ్తోంది.  1 - 2నంబర్లకే అలవాటవడంతో 3 నంబర్ ఎవరూ నొక్కడం లేదట. కేవలం ఈ కాల్ విని ఆన్సర్ చేసినవారు తప్ప యథాలాపంగా కాల్ ఆన్సర్ చేసి 1 లేదా 2 నొక్కేవారంతా ఇప్పుడు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నట్లే అవుతోంది.
   
సంతృప్తిగా ఉన్నవారు 1 నొక్కితే అక్కడ ఆ ఆప్షన్ లేదు కాబట్టి కాల్ ఎండ్ అవుతుంది. ఒకవేళ అసంతృప్తి వ్యక్తంచేయడానికి 2 నొక్కినా అది సంతృప్తి చెందారన్న ఫలితం ఇస్తోంది. అయితే.. కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ ఆప్షన్ మార్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఇప్పటివరకు నెగటివ్ రిజల్ట్ ఉన్నవారిని కూడా పాజిటివ్‌ లో చూపించి టికెట్ ఇచ్చే ప్రయత్నంగా తెలుస్తోంది.
   
అదేసమయంలో ఎమ్మెల్యేలే ఈ వ్యవస్థ నిర్వాహకులతో డీల్ చేసుకుని ఈ మార్పులు చేసుకుంటున్నారన్న ప్రచారమూ ఒకటి జరుగుతోంది. అదే నిజమై చంద్రబాబుకు విషయం తెలియకపోతే మాత్రం ఆయన బోల్తాపడడం ఖాయం.

Tags:    

Similar News