చంద్రబాబు తొండి ఆట ఆడుతున్నారా!

Update: 2019-05-21 06:25 GMT
ఆడలేనమ్మ మద్దెల ఓడు అంటుందట.. అదీ సామెత. ఈ సామెత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అన్వయించదగినదిగా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ఓటమికి నెపాలను వెదుక్కొంటున్నట్టుగా ఉంది కానీ.. మరోటి కాదని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు.

చంద్రబాబు నాయుడు తన వైఫల్యాలకు ఎప్పుడూ ఇతరుల మీద నెపాలను నెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎన్నికల్లో ఓడినా.. తన మిత్రపక్షాల మీదకు రాళ్లు వేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. వాళ్లతో జత కట్టడం వల్లనే తన పార్టీ ఓడిపోయిందని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు.

అయితే ఈ సారి చంద్రబాబుకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆయన పార్టీ సోలోగా పోటీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ సారి నెపాన్ని ఈవీఎంల మీదకు నెట్టేసే ప్రయత్నంలో ఉన్నారని స్పష్టం అవుతోంది. గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చారు.

పోలింగ్ రోజు నుంచి అది మరీ ఎక్కువ అయ్యింది. తను సైకిల్ కు ఓటేస్తే అది ఫ్యాన్ కు పడినట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఏపీలో ఏ ఒక్క ఓటర్ కూడా ఆ కంప్లైంట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు మాత్రమే అలా మాట్లాడారు.

అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద పదే పదే నిందలు వేస్తూ వస్తున్నారు. వీవీ ప్యాట్లు ఉన్నా.. వాటి ద్వారా ఓటర్లు తమ ఓటు ఎటు వైపుకు పడిందో తెలుసుకునే అవకాశం ఉన్నా.. చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలందరినీ వెర్రి వాళ్లను చేసేలా మాట్లాడుతూ ఉన్నారు.

ఈ అంశంలో ఆయన, కొన్ని పార్టీలను కలుపుకుని కోర్టుకు కూడా వెళ్లారు. వీవీ ప్యాట్ స్లిప్పులు అన్నింటినీ లెక్కించాలని సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. మొదట ఒక్కో అసెంబ్లీకి ఏడు వీవీ ప్యాట్ లలోని స్లిప్పులను లెక్కించాలని చెప్పిన కోర్టు, రెండోసారి చంద్రబాబు అండ్ కో కోర్టుకు వెళ్లగా అప్పుడు వారి పిటిషన్ ను ఒక్క నిమిషంలోనే కొట్టివేసింది.

కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ లను లెక్కించాలన్న చంద్రబాబు, ఆయన మిత్ర  పక్షాల డిమాండ్ ను కోర్టు తిరస్కరించింది. అయినా చంద్రబాబు అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు.

దానికి తోడు 'ముందుగా ఈవీఎంలను లెక్కించకూడదు, ముందు వీవీ ప్యాట్ లను లెక్కించాలి' అంటూ కొత్త డిమాండ్ ను చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎలా తనకు తోచిన డిమాండ్లను చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ల వెనుక అసలు కథ అంతా.. చంద్రబాబుకు ఉన్న ఓటమి భయమే అని, ఓటమి ఖాయమనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఇలా విచిత్రమైన డిమాండ్లను చేస్తూ తొండి ఆట ఆడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News