ఇంకెన్నాళ్లీ ప‌స‌లేని సైబ‌ 'రొదా' బాద్‌ షా సినిమాలు

Update: 2018-12-02 05:16 GMT
పొద్దున్నే ఉలిక్కిప‌డ్డాను. పేప‌రు చ‌దువుతుంటే మూర్ఛ‌వ‌చ్చినంత ప‌నైంది నాకు సైబ‌రాబాద్‌ షా నేనే అంటూ.. సీఎం ప్ర‌క‌ట‌న‌లు పేప‌ర్ల నిండా పెద్ద పెద్ద అచ్చ‌రాల‌తో అచ్చ‌య్యే స‌రికి కాసేపు వ‌ణికిపోయాను. (ఈ వ్యాసంతోపాటు పోస్టు చేసిన 4 - 5 ఫొటోలను చూశారంటే మీకు కూడా ద‌బిడి దిబిడే.. ) పాడిందే పాడ‌రా.. అంటూ ప‌దే ప‌దే ఈ కాకి గోల‌మాకేంది అని వెంట‌నే ఐటీ పుట‌ల్లోకి వెళ్లి - కంప్యూట‌ర్ గ‌నిని శ్ర‌మప‌డి త‌వ్వితే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి.

వినేవాడు ఎర్రోడయితే సెప్పేవాడు సెల‌రేగిపోతాడంట‌.. మ‌న సీఎం చంద్ర‌బాబు తీరు అచ్చు ఇలానే ఉంది. ఇదేం దౌర్భాగ్య‌మో పాపం కాంగ్రెస్ నాయ‌కులు వారు చేసుకున్న అభివృద్ధిని కూడా వారు చెప్పుకోలేని విచిత్ర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయ‌న‌గారేమో నేను సైబ‌రాబాద్‌ షా.. అంటూ పెద్ద పెద్ద ప‌దాలు వాడుతుంటే.. వెనుకాల ఉన్న కాంగ్రెస్ సైన్యం వారి స్వీయ వైభ‌వాన్ని మ‌రిచిపోయి తాటాకుల్లా త‌ల‌కాల‌య‌లు ఊపుతుంటే ఓ పేద్ద కామెడీ సినిమా చూసిన‌ట్ల‌నిపించింది. బాబుల్లారా.. ఓ కాంగ్రెస్ నేత‌ల్లారా.. కాస్త ఇటు చూడండి.. మీ ఘ‌న చ‌రిత్ర‌ను తెలుసుకోండి. బాబుదేం లేద‌య్యా బాబులూ.. మీరేన‌య్యా తోపులు.. అంటూ మాలాంటి వాళ్లు మీకు గుర్తు చేయాల్సిరావ‌డం మీమ్మ‌ల్ని ఆవ‌హించిన దౌర్భాగ్యానికి నిద‌ర్శ‌నం.

రెండు రోజులుగా తెలంగాణ‌లో టీడీపీ అధినేత ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా అదే ప‌నిలో ఉన్నారు. ఏపీ సీఎం బాబు రోడ్డుషోలు - స‌భ‌లు నిర్వ‌హిస్తున్నారు. రాహుల్ తో క‌లిసి భారీ బ‌హిరంగ స‌భ‌ల్లోనూ పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ సైతం చంద్ర‌బాబునాయుడిని వీరుడు - శూరుడు అంటూ ఆకాశానికెత్తేయ‌డం అదో పేద్ద‌ రాజ‌కీయ వైప‌రీత్యం. నిజంగానే ఇదో ఉప‌ద్ర‌వం. ప‌ల్లెత్తు నిజమైన మాట్లాడ‌ని దుర్యోధ‌నుడే మ‌హాభార‌త క‌థ మొత్తానికి హీరో అంటూ ఎవ‌రైనా మొండిగా తీర్మానం చేస్తే ఎంత కంప‌రంగా ఉంటుందో రాహుల్ గాంధీ ప్ర‌సంగంలో ఆ పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడల్లా యావ‌త్ తెలుగువారంద‌రి ప‌రిస్థితి ఇలా కంప‌రంగానే ఉండి ఉంటుంది.

చంద్రబాబు - ఆయన చుట్టూ ఉండే భ‌జ‌న బృందం - మీడియా అంతా ఏక‌మై సాగిస్తున్న అరాచ‌క ప్ర‌చారం ఇది. టీడీపీ అధినేత వ‌ల్ల‌నే తెలుగునాట ఐటీ విప్ల‌వానికి పునాదులు ప‌డ్డాయంటూ అంద‌రి చెవులూ దిబ్బులెక్కేలా విష‌పు వాద‌న‌లు అన్ని వైపుల నుంచి మోత‌మోగుతున్నాయి. ఈ ధ్వ‌ని ఇనుప‌రేకును బండ‌కేసి గీకితే వ‌చ్చే వికార‌త్వ‌పు శ‌బ్దాన్ని గుర్తు చేస్తోంది. ఆపండ‌య్యా బాబులు మీ రంప‌పు పొట్టు వాద‌న‌లు. లేదంటే జ‌న‌మంతా ఏక‌మై తిర‌గ‌బ‌డినా తిర‌గ‌బ‌డ‌తారు. ఒక్కసారి హైదరాబాదు ఐటీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. మన ముత్తాతల కాలం నాడే అక్కడ కంప్యూట‌రేంద్ర‌జాలం రూపుదిద్దుకున్న‌ద‌నే విష‌యం ఇట్టే తెలిసిపోతుంది.

1980ల్లోనే హైదరాబాదులో సాఫ్ట్‌ వేర్ రంగానికి బీజం పడిందని నొక్కి చెప్పేందుకు ఆ మ‌హా నగరంలోని మైత్రీ వనం భవనం మౌనంగానే సాక్ష్యంగా నిలుస్తోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పేందంతా అబ‌ద్దాలేరా నాయ‌నాల‌రా.. అంటూ ఆ భ‌వ‌నం మౌనంగానే ధ్వ‌నిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి టెక్నాజీ పార్కును ఏర్పాటు చేసింది ఈ మైత్రీవనం భవనంలోనే. దాని విస్తరణా ఫలితమే మాదాపూర్‌ లో మనకు ఇప్పుడు కనిపిస్తున్న ఐటీ అభివృద్ధి. 1982లోనే మైత్రీవనం భవనంలో కంప్యూటర్‌ మెయింటినెన్స్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) సంస్థ సాఫ్ట్‌ వేర్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ను ఏర్పాటుచేసింది. 1982 అంటే బాద్‌ షా.. ఆ షా.. ఈ షా.. అని చెప్పుకుంటున్న మ‌న చంద్ర‌బాబుగారి రాజ‌కీయ స్థాయి ఏ పాటిదో మ‌నం తెలుసుకోలేనంత అజ్ఞానులం అయితే కాదు. ఇంటర్రాగ్రాఫ్‌ అనే సంస్థ 1987ఆగస్టులోనే తన కార్యకలాపాలు ఇక్క‌డ ఆరంభించింది. చంద్ర‌బాబు  పదే పదే ప్రస్తావించే సత్యం రామలింగరాజు సైతం 1987లోనే తన బంధువుతో కలిసి సత్యం సంస్థను ఆరంభించారు. అప్పుడు సీఎంగా ఉన్న వ్య‌క్తి దివంగ‌త ఎన్టీ రామారావు. అది అభివృద్ధి చెంది 1992లోనే పబ్లిక్‌ ఇష్యూకు కూడా వెళ్లిపోయింది. అప్పుడు కూడా ఇప్ప‌టి టీడీపీ అధినేత సీఎం కానే కాదు.

అస‌లు వాస్త‌వానికి హైదరాబాదులో ఐటీ విప్లవానికి బీజం వేసింది నాటి ప్రధాని పీవీ నరసింహారావు. పీవీ సంస్కరణల‌ పుణ్యమా అని దేశ ఆర్థక రంగం పునరుత్తేజిత‌మైంది. సాఫ్ట్‌ వేర్‌ టెక్నాల‌జీ పార్కు (ఎస్‌ టీపీఐ) అనే కాన్సెప్ట్ ను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చి ప్ర‌చారం చేసిన వ్య‌క్తి పీవీనే. దేశం మొత్తం మీద తొలి ద‌శ కింద ఆరు ఎస్‌ టీపీఐల‌ను ఆయ‌న ప్ర‌ధానిగా మంజూరుచేశారు. వీటిలో ఒక ఎస్టీపీఐ కోసం హైద‌రాబాదు కూడా ఎంపికైంది. అంటే నేటి ఐటీ అభివృద్ధి అడుగుల వెనుక మూడు ద‌శాబ్దాల కిందట పీవీ వేసిన ఫౌండేష‌న్ స్టోనే అస‌లు కార‌ణం. కేంద్రకమ్యునికేషన్‌ - ఇన్ ఫర్మేషన్‌ మంత్రిత్వశాఖ తొలుత 1991లో అమీర్‌ పేటలోని మైత్రీవనంలో ఒక ఎస్‌ టీపీఐను కేంద్ర ప్ర‌భుత్వం ఆరంభించింది. అదే భ‌వ‌నంలో అంత‌కు ప‌దేళ్ల కింద‌టే సీఎంసీ కూడా త‌న కార్య‌క‌లాపాలు కూడా ప్రారంభించింది. కింద పోస్టు చేసిన‌ ఫొటోల్లో ఒక‌టో నంబ‌రు ఫొటోలో మ‌న క‌నిపించేదే మైత్రివ‌నం భ‌వ‌నం. నాటి ప్రధాని సూచన మేరకే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి మంత్రివర్గం పదెకరా స్థలాన్ని మాదాపూర్ (ఇదేనండి బాబులు ఇప్పుడు మ‌న ఐటీ దాన వీర శూర క‌ర్ణ గారు చెబుతున్న సైబ‌రా బాద్ షా... ప్రాంతం) ప్రాంతాల్లో ఇచ్చేందుకు నిర్ణయించింది. ఐటీ అభివృద్ధి, సొంత భవన నిర్మాణం కోసం పదెకరాల‌ స్థలాన్ని అప్పట్లో కేటాయించారు. 21 మే 1992 నేదురుమల్లి స్వయంగా ఇప్పటి సైబర్‌ టవర్స్(మ‌న సీఎం సార్ చెబుతున్న హైటెక్ సిటీ) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాసంతో పాటు పోస్టు చేసిన ఫొటోల్లో ఒక‌సారి 1 - 2 నంబ‌ర్ల‌ను ప‌రిశీలంచ‌గ‌ల‌రు. అప్పట్లో హైటెక్ సిటీ నిర్మాణ వ్యయం అంచనా రూ.4.5 కోట్లు. ఈ వ్యవహారాల‌న్నీ పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎల‌క్ట్రానిక్స్‌ డెవల‌ప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ను ఏర్పాటుచేశారు. అప్పుడే అనేక అమెరికా కంపెనీలు ఇక్కడ వారి వ్యాపార కార్యకలాపాల‌ నిర్వహణకు తమ సంసిద్ధతను తెలియజేశాయి. రూ.400 కోట్ల సాఫ్ట్‌ వేర్‌ ఉత్పత్తులు - ఎగుమతుల ల‌క్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 ప్రముఖ సంస్థల‌కు లేఖలు రాసి - రాష్ట్రం కల్పించే ఐటీ సదుపాయాల‌ను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఇదండీ హైద‌రాబాదు ఐటీ అభివృద్ధి వెనుక ఉన్న అస‌లు క‌థ‌.. ఇంత పెద్ద ఐటీ పురాణంలో ఎక్క‌డైనా స‌రే.. క‌నీసం ఒక్క‌టంటే ఒక్క‌చోటైనా స‌రే చంద్ర‌బాబుపేరు మొహ‌మాటం కోస‌మైనా వ‌చ్చిందా..? కానీ పాపం హైటెక్‌ సిటీ కథల్లో ఎక్క‌డా కూడా ఆనాటి కార్యాచరణ తాలూకూ ఆనవాళ్లు గాని - నాటి కాంగ్రెస్ నేత‌ల పేరుగాని త‌ల‌పులోనే లేకుండా పోయాయి.

1994లో అధికారంలోకి వ‌చ్చిన చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అస్మదీయులందరితోనూ మాదాపూర్‌ పరిసరాల్లో కావాల్సినంత భూమిని కొనిపించారు. ఆ తర్వాత హైటెక్‌ సిటీ నిర్మాణం వేగవంతం చేశారు. అస‌లు వాస్త‌వాలు మాట్లాడుకుంటే చంద్రబాబుహయాంలోనే ఐటీ బాగా పతనానికి చేరుకుంది. నిజానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 1995 సెప్టెంబరు నాటికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉండగా చంద్రబాబు అధికారాంతాన అంటే 2004లో ఐదో స్థానానికి పడిపోయింది. ఎస్‌ టీపీఐ ఆరంభమయ్యాక రూ.25 ల‌క్షల‌ ఎగుమతుల‌తో మొదలై - వరుసగా ఎనిమిదేళ్లు వంద శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అది 2000లో 85 శాతానికి - 2001లో 81 శాతానికి - 2002లో 42 శాతానికి పడిపోయింది. సాప్ట్‌ వేర్‌ ఎగుమతుల‌కు సంబంధించి బెంగళూరు - హైదరాబాద్‌ నగరాల‌ నడుమ తేడా 1995-96లో కేవలం రూ.250 కోట్లు కాగా అది కాస్తా 2003-04 నాటికి రూ.2500 కోట్లకు చేరిపోయింది. 2003-04 సాఫ్ట్‌ వేర్‌ ఎగుమతుల‌ గణాంకాల‌ మేరకు దేశంలో కర్నాటక వాటా 38 శాతం కాగా.. ఏపీ వాటా అప్పట్లో కేవలం 9 శాతం మాత్రమే ఉంది. 2008-09 నాటికి అంటే వైఎస్ హ‌యాంలో ఆ వాటా 14 శాతానికి చేరింది. భౌగోళిక అనుకూల‌తలు - అనువైన వాతావరణ పరిస్థితులు - అందుబాటులో మానవ వనరుల‌ కారణంగా హైదరాబాదులో సహజంగానే ఐటీ అభివృద్ధి సాధ్యమైంది. అయినా సరే కర్నాటక వంటి రాష్ట్రాల‌తో పోలిస్తే.. మ‌న అభివృద్ధి తక్కువే. నిజాలు ఇలా ఉంటే.. చంద్రబాబు - ఆయన చిడ‌తల‌ బ్యాచ్ చేసిన ప్రచారాన్ని బట్టి ఐటీ - సాఫ్ట్‌ వేర్‌ రంగంలో దేశంలోనే మ‌నం మొద‌టి స్థానంలో ఉన్నామ‌ని ఎవ‌రైనా భావించినా భావించేస్తారు.

చెన్నయ్‌ - బెంగళూరు కేంద్రంగా ఐటీ అభివృద్ధి జోరుగా సాగింది. అయినా స‌రే ఆయా రాష్ర్టాలు త‌మ ప‌నిని తాము నిశ్శ‌బ్దంగా చేసుకుపోయాయి. చంద్రబాబు - ఆయ‌న వందిమాగ‌దులు మాత్రం ఉద్దేశ పూర్వకంగా భారీ ప్రచారానికి పూనుకున్నారు. ఐటీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సాఫ్ట్‌ వేర్‌ అభివృద్ధిలో ఒక భాగం మాత్ర‌మే అయ్యారు త‌ప్ప‌.. ఆయ‌న ఏదో సాధించేయ‌లేదు.  చంద్రబాబు హయాంలో 85,945 మందికి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలు వచ్చాయి. కానీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2009 -10 నాటికి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగుల సంఖ్య 2,64,375 మందికి చేరుకుంది. బాబు హ‌యాంలో ఐటీ రంగంలో ఏపీ ఐదో స్థానంలో ఉంటే వైఎస్ హ‌యాంలో మూడో స్థానానికి చేరుకుంది. బాబు హ‌యాంలో ఐటీ రంగం మ‌న రాష్ర్ట‌వాటా 8.6 శాతంగా - ఇక్క‌డ కంపెనీల సంఖ్య 909గా ఉంటే - వైఎస్ హ‌యాంలో మ‌న రాష్ర్ట ఐటీ రంగం వాటా ఏకంగా 14.93 శాతంగా - కంపెనీల సంఖ్య 1584గా న‌మోద‌య్యాయి. బాబు హ‌యాంలో మ‌న రాష్ర్టానికి ఐటీ రంగం కోసం వ‌చ్చిన పెట్టుబ‌డులు రూ.3,533 కోట్లు - ట‌ర్నోవ‌ర్ రూ.5025 కోట్లుగా ఉండ‌గా.. వైఎస్‌ పాల‌న చివ‌రి రోజుల నాటికి అంటే 2008 నాటికి ఐటీ రంగం పెట్టుబ‌డులు రూ.13,250 కోట్ల‌కు - ట‌ర్నోవ‌ర్ రూ.33,483 కోట్ల‌కు చేరింది.

అయ్యా కాంగ్రెస్ నాయ‌కులారా సైబ‌రాబాద్‌ షాలు - హైద‌రాబాదు నిర్మాణదాత‌లు మీర‌నుకుంటున్న‌ట్లుగా ఏపీ సీఎం కానే కాదండోయ్‌.. ఏపీకి సంబంధించి నిజ‌మైన ఐటీ హీరోలు పీవీ న‌ర‌సింహారావు - నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్‌ రెడ్డి - వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాత్ర‌మేనండోయ్‌.. ఒక‌రు ఫౌండేష‌న్ స్టోన్ వేస్తే.. వైఎస్ ఐటీ రంగాన్ని స‌గ‌ర్వంగా నిల‌బెట్టారు. ఇప్ప‌టికైనా టీడీపీ అధినేత భ‌జ‌న‌లోంచి బ‌య‌ట‌కు వ‌స్తే మంచిది. వైఎస్ నామ‌జపం చేస్తే మ‌రీ మంచిది. మొహ‌మాటానికి పోయి వైఎస్‌ ను విస్మ‌రించారా.. ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని విస్మ‌రించినా విస్మ‌రిస్తారు. అయినా నా భ్ర‌మ కానీ.. ఏపీలో ఇప్ప‌టికే విస్మ‌రించేశారు క‌దా.. ఇక మిగిలింది తెలంగాణ‌లోనే!



Tags:    

Similar News