లేట్ అయినా లేటెస్ట్ గా రాలేక‌పోయిన బాబు

Update: 2018-01-02 11:24 GMT
బంగారు పుట్ట‌లో వేలు పెడితే ఎవ‌రికైనా నొప్పే. అందులో.. త‌న అడ్డా అయిన ఏపీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేలు పెడితే ఎంత చంద్ర‌బాబు అయినా చురుకు పుట్ట‌కుండా మాన‌దు క‌దా. మామూలుగా అయితే.. కేసీఆర్ కు మైలేజీ వ‌చ్చే ఏ ప‌ని విష‌యంలోనూ ఆచితూచి అడుగులు వేస్తే.. మైలేజీ విష‌యంలో ఎంతో కొంత చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. కేసీఆర్ ఏదైనా ఒక భారీ కార్య‌క్ర‌మాన్ని చేపడితే.. అదే రోజు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రో కార్య‌క్ర‌మానికి తెర తీసి.. రెండు కార్య‌క్ర‌మాలు క‌వ‌ర్ అయ్యేలా.. బ్యాలెన్స్ అయ్యేలా వ్యూహాలు ప‌న్నుతుంటారు. ఇలాంటివ‌న్నీ చంద్ర‌బాబే స్వ‌యంగా చేయ‌కున్నా.. ఇలాంటి వ్యూహాన్ని సిద్ధం చేయ‌టానికి బాబు త‌ర‌ఫున ఒక బ్యాచ్ తీవ్రంగా శ్ర‌మిస్తూ ఉంటుంది.

మ‌రి ఎక్క‌డ త‌ప్పు దొర్లిందో కానీ.. న్యూఇయ‌ర్ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి 24 గంట‌ల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ షురూ చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన ఈ పథ‌కానికి సంబందించిన స‌మాచారాన్ని భారీ యాడ్ రూపంలో ఏపీలోని ముఖ్య‌మైన మీడియా సంస్థ ద్వారా మొద‌టిపేజీ మొత్తం క‌ప్పేసేలా ఇచ్చారు.

కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. కేసీఆర్ అదిరిపోయే ప‌థ‌కాన్ని షురూ చేస్తున్నార‌న్న మెసేజ్ ను ఏపీలోని సీమాంధ్రుల‌కు అందేలా చేశారు. ఏపీలో లేని ఒక భారీ ప‌థ‌కాన్ని.. తెలంగాణ ప్ర‌భుత్వం ఎంత గ్రాండ్ గా అమ‌లు చేస్తోంద‌న్న విష‌యాన్ని యాడ్ రూపంలో చెప్పేశారు. నిజానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్రారంభిస్తున్న ప‌థ‌కాన్ని ఏపీలోని ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. రాజ‌కీయ కోణంలో చూస్తే.. ప‌రోక్షంగా బాబు ప్ర‌భుత్వంపై తాజా యాడ్‌ ఒత్తిడిని పెంచింద‌ని చెప్పాలి.

దీంతో డిఫెన్స్ లో ప‌డిన చంద్ర‌బాబు.. ఈ రోజు ఏపీలోని త‌న‌కు ద‌న్నుగా నిలిచే ప‌త్రిక‌ల‌కు మొద‌టి పేజీలో భారీ యాడ్ అచ్చేయించారు. ఇందులో ప్ర‌భుత్వం చేప‌ట్టిన భారీ కార్య‌క్ర‌మాలుగా ప్ర‌క‌టించారు. కేసీఆర్ తో పోలిస్తే.. లేట్ గా రియాక్ట్  అయిన‌ప్ప‌టికీ.. డ్యామేజ్ కంట్రోల్ చేసేలా యాడ్ ఇవ్వాల‌ని భావించినా.. అదేమీ ప్ర‌భావం చూపించేలా లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఏపీ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ.. రాష్ట్రంలో అద్భుత‌మైన చంద్ర‌న్న పాల‌న సాగుతుంద‌న్న భావ‌న క‌లిగే క‌ల‌ర్ ఇచ్చారు. అయితే.. ఇవేమీ జ‌న‌వ‌రి 1న కేసీఆర్ ఇచ్చిన యాడ్ ముందు ధీటుగా నిల‌బ‌డ‌లేక‌పోయాయ‌ని అనుకుంటున్నారు. లేట్ అయినా లేటెస్ట్ గా వ‌చ్చిన‌ట్లుగా క‌నిపించినా.. యాడ్ లోని కంటెంట్  ఏపీ ప్ర‌జ‌ల్ని మెస్మ‌రైజ్ చేయ‌లేక‌పోయింది అని టాక్ . ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు సంగ‌తి స‌రే.. అనుకున్నంత మైలేజీ రాక‌పోవటం తెలుగు త‌మ్ముళ్ల‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి అవుతున్నారు.


Tags:    

Similar News