చినబాబుకు తోడు పెదబాబు కూడా!

Update: 2018-01-17 07:53 GMT
దావోస్ లో జరగబోతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఈసారి భారతీయ నేతల వెల్లువలో మునిగిపోయేలా ఉంది. ఈసారి సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. మన దేశం నుంచి ప్రధాని నరేంద్రమోడీ కూడా వెళ్లబోతున్నారు. వీరిద్దరి మధ్య సమావేశం జరిగే అవకాశం ఉన్నదనే ప్రచారమూ జరుగుతోంది. తెలుగురాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అధికారిక దావోస్ ఆహ్వానం అందగా.. ఆయన ప్రస్తుతం దక్షిణకొరియా జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అటునుంచి అటే దావోస్ చేరుకోబోతున్నారు. కాగా, ఐటీ రంగం గురించిన ఒక సదస్సును స్పాన్సర్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం తరఫున నారా లోకేష్ వెళ్తారని నిన్నటి వరకు సమాచారం ఉంది. కాకపోతే ప్రస్తుతం చినబాబుకు తోడుగా పెదబాబు కూడా దావోస్ కు వెళుతున్నట్లు వార్తలు చెబుతున్నాయి.

దావోస్ ఆర్థిక సదస్సులో మన నాయకులు ఏం సాధిస్తున్నారనేది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నే. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకించి.. చంద్రబాబునాయుడు దాదాపుగా  ప్రతిసారీ.. దావోస్ సదస్సుకు వెళుతున్నారు. అక్కడకు వచ్చే పారిశ్రామికవేత్తలు - ప్రముఖులను కలిసి ఫోటోలు దిగుతున్నారు. మారాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడం అని కూడా అంటున్నారు.

ఇన్ని జ రుగుతున్నప్పటికీ.. దావోస్ పునాదుల మీద వచ్చిన పెట్టుబడి అంటూ కనీసం ఒక్కటైనా రాష్ట్రం లో కనిపించడం లేదనేది పలువురి విమర్శ. ఆ మాటకొస్తే పెట్టుబడుల కోసం.. పారిశ్రామికీకరణ కోసం.. అనే మిషమీద విదేశీటూర్లు చాలానే జరుగుతున్నాయి గానీ.. వాటికి ప్రపోర్షనేట్ గా ఫలితాలు మాత్రం కానరావడం లేదనేది సర్వత్రా వినిపిస్తున్న మాట.

అయితే ఈసారి దావోస్ సదస్సుకు తొలుత లోకేష్ మాత్రం వెళ్తారని ప్రచారం జరగడంతో.. చంద్రబాబునాయుడు ఈ సదస్సు అందించే రిజల్టేమీ ఉండదని విరక్తి పెంచుకున్నారేమో అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. కానీ.. సమయం దగ్గర పడేసరికి.. ఆయన కూడా బయల్దేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక రాష్ట్రం అవకాశాల గురించి ప్రచారం చేయడానికి కేబినెట్ నుంచి ఇద్దరు ప్రముఖులు వెళ్తుండడం ఒక రకంగా విశేషమే కావొచ్చు. ఏదేమైనా సత్ఫలితాలు అందివచ్చి.. పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తే మంచిదే.. అందుకు వారి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. అంతే తప్ప.. ఏదో పసిబిడ్డకు దగ్గరుండి తర్ఫీదు ఇవ్వడానికి అన్నట్లుగా అంతర్జాతీయ సదస్సుల్లో ఎలా వ్యవహరించాలో.. మైలేజీ ఎలా సంపాదించుకోవాలో.. కొడుకుకు దగ్గరుండి స్వయంగా నేర్పడానికి అన్నట్లుగా వెళితే మాత్రం ప్రజలు ఆ తేడాను గుర్తిస్తారు.. అని విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News