చినజీయర్ కు చంద్రబాబు పాదాభి‘వందనం’

Update: 2019-11-02 04:33 GMT
రాజకీయ నేతలకు శాశ్విత మిత్రుడు.. శాశ్విత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. పవర్ లో ఉన్నప్పుడు కంటికి కనిపించని వారంతా.. చేతిలో ఉన్న అధికారం పోయినంతనే వారంతా గుర్తుకు వస్తారు. తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు స్వామీజీల వైపు పెద్దగా చూడటానికి ఇష్టపడని అధినేతగా చంద్రబాబును చెబుతారు. కొందరి విషయంలో ఆయన ఎలా ఉన్నా.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన చినజీయర్ స్వామి విషయంలో బాబుకు మంచి టర్మ్స్ లేవన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

తాను సీఎంగా ఉన్నప్పుడు తిరుమలలోని వెయ్యికాళ్లమండపాన్ని కూల్చివేసే విషయంలో బాబు వర్సెస్ జీయర్ స్వామి మధ్య చోటు చేసుకున్న విభేదాలు తెలిసినవే. వెయ్యి కాళ్ల మండపం విషయంలో జీయర్ స్వామి అభిమతానికి వ్యతిరేకంగా బాబు నిర్ణయం తీసుకోవటం ఆయన్ను వేదనకు గురి చేసింది.

నాటి నుంచి చినజీయర్ స్వామి బాబుకు దూరంగా ఉంటూనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. జీయర్ స్వామితో బాబుకు సంబంధాలు లేవనే చెప్పాలి. అలాంటి చంద్రబాబు.. విపక్ష నేత హోదాలో తాజాగా ముచ్చింతల్ లోని జీయర్ స్వామి దర్శనానికి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. చినజీయర్ పుట్టిన రోజు కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో.. తిరు నక్షత్ర వేడుకులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావటం ఆసక్తికరంగా మారింది.

తన అలవాటుకు భిన్నంగా జీయర్ స్వామి కాళ్లకు దండం పెట్టిన చంద్రబాబు.. ఆయన కరణ కటాక్షాల కోసమే అన్నట్లుగా వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన మెడలో వేసిన తులసిమాలను చంద్రబాబుకు వేయటం ద్వారా.. తన కరుణా కటాక్షాలు బాబుకు ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చినట్లుగా తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకోవటం కనిపించింది.

ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. జీయర్ స్వామి ఆశ్రమానికి చంద్రబాబు వెళ్లిన సమయంలో.. అక్కడ మై హోం రామేశ్వర్ మాష్టారు కూడా ఉండటం చూస్తే.. ఈ మీటింగ్ వెనుక ఆయన ఉన్నారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వామీజీలకు దూరంగా ఉంటారన్న పేరున్న చంద్రబాబు.. తన తీరుకు భిన్నంగా జీయర్ స్వామి ఆశ్రమానికి రావటం.. కాళ్లకు దండం పెట్టటం చూస్తే.. ఓటమి బాబు లాంటోళ్లను సైతం ఇంతలా మార్చేస్తుందా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏమైనా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విపరీతంగా నమ్మె చినజీయర్ స్వామి ఆశీస్సుల కోసం బాబు పడిన తపన మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News