మొన్న‌టి మిస్ ఫైర్ ను రిపీట్ కాకుండా చూసుకున్న బాబు

Update: 2019-06-18 10:51 GMT
ఏపీ స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలో చోటు చేసుకున్న వివాదం గురించి తెలిసిందే. స్పీక‌ర్ ఎన్నిక స‌మాచారం త‌న‌కు ఇవ్వ‌లేద‌ని.. ఆయ‌న్నుస‌భాప‌తి స్థానంలో కూర్చోబెట్టేందుకు ఆహ్వానం అందివ్వ‌లేద‌ని.. అందుకే తాను వెళ్ల‌కుండా.. త‌న పార్టీ నేత‌ను పంపిన చంద్ర‌బాబు ఎదుర్కొన్న విమ‌ర్శ‌లు అన్ని ఇన్ని కావు. తన‌ను పిల‌వ‌కుంటే తాను మాత్రం వెళ‌తానా? అంటూ బాబు చేసిన వాద‌న మిస్ ఫైర్ కావ‌ట‌మే కాదు.. ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు.

చివ‌ర‌కు బాబు స‌న్నిహితులు కూడా ఆయ‌న తీరును వేలెత్తి చూపించిన ప‌రిస్థితి. అధికార‌ప‌క్షం త‌ప్పు చేస్తే మాత్రం.. బాబు ఎందుకు త‌ప్పు చేయాలి? అన్న ప్ర‌శ్న‌తోపాటు.. స్పీక‌ర్ ను ఆయ‌న స్థానం వ‌ద్ద‌కు తీసుకెళ్లే విష‌యంలో బాబు అనుస‌రించిన తీరును స‌రికాద‌ని తేల్చేశారు.

అధికార‌పక్షం ఆహ్వానించ‌కున్నా.. త‌న‌కు తానుగా స్పీక‌ర్ ను ఆయ‌న స్థానం వ‌ద్ద కూర్చొబెట్టి ఉంటే మ‌ర్యాద‌గా ఉండేద‌ని.. త‌న విష‌యంలో అధికార‌ప‌క్షం వ్య‌వ‌హ‌రించిన తీరును త‌ర్వాత చెబితే బాగుంటుందంటూ ఒక స‌ల‌హాను ఇచ్చారు. త‌న ఎత్తుగ‌డ మిస్ ఫైర్ అయిన నేప‌థ్యంలో బాబు ఈసారి జాగ్ర‌త్త ప‌డిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

మొన్న జ‌రిగిన త‌ప్పును మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త పడ్డారు. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ గా వివాదార‌హితుడు కోనా ర‌ఘుప‌తిని నియ‌మిస్తూ స‌భ ఏక‌గ్రీవంగా తీర్మానం చేసింది. అనంత‌రం ఆయ‌న్ను స‌భాప‌తి స్థానంలో కూర్చోబెట్టేందుకు వీలుగా ఆయ‌న్ను తీసుకెళ్లారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కూడా ఉన్నారు. ముందు జ‌గ‌న్‌.. వెనుక చంద్ర‌బాబు వారిద్ద‌రి మ‌ధ్య‌న కోన ర‌ఘుప‌తి న‌డుచుకుంటూ స్పీక‌ర్ స్థానంలో ఆసీనుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు.అనంత‌రం విప‌క్ష నేత చంద్ర‌బాబు ఆయ‌న్ను అభినందించారు. ఆ త‌ర్వాత రెండు పార్టీల‌కు చెందిన ముఖ్య‌నేత‌లు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మొత్తానికి స్పీక‌ర్ ఎపిసోడ్ లో త‌ప్పు చేసిన చంద్ర‌బాబు తాజాగా మాత్రం త‌న త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Tags:    

Similar News