చంద్రబాబు.. కేవీపీ మధ్య రహస్య సంభాషణ

Update: 2022-03-01 05:30 GMT
తూర్పు - పడమర.. ఉప్పు - నిప్పులు కలిసిపోవటం సాధ్యం కాదు. కానీ.. అలాంటి తీరుతో ఉన్న రాజకీయ నేతల మధ్య మాత్రం కలిసిపోవటం కనిపిస్తుంటుంది. మాటలు మాట్లాడుకోవటానికి కూడా ఇష్టపడని నేతలు.. అందుకు భిన్నంగా ఒకరికొకరు మాట్లాడుకోవటమే కాదు.. కాసేపు రహస్య సంభాషణ జరిపిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రధాన మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ ఉదంతం సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ చక్కర్లు కొడుతోంది. రాజకీయ దురంధుడు.. ఏపీ రాజకీయాల్లో పెద్దాయనగా అందరూ పిలిచుకునే మాజీ రాజ్యసభ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు తన 104 ఏళ్ల వయసులో కన్నుమూయటం తెలిసిందే.

సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారన్న విషయం తెలిసినంతనే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమార్తె ఇంటికి వెళ్లారు. యడ్లపాటికి నివాళులు అర్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యడ్లపాటిని పరామర్శించిన సందర్భంలో అక్కడే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా చెప్పే కేవీపీ రామచంద్రరావు ఉండటం ఒక ఎత్తు అయితే.. బయటకు వచ్చిన వారిద్దరు.. మిగిలిన నేతలకు దూరంగా కాసేపు మాట్లాడుకోవటం గమనార్హం.

రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ఉద్దేశించి కేవీపీ తరచూ లేఖాస్త్రాలు సంధించేవారు. ప్రత్యేక హోదా సాధన విషయంతో పాటు పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన తరచూ ప్రశ్నల్ని సంధించేవారు.

ఇక.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవీపీని ఉద్దేశించి చంద్రబాబు.. ‘రాజ్యాంగేతర శక్తి’గా అభివర్ణించటం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య మాటలు పెద్దగా ఉండవని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. అలాంటి ఈ ఇద్దరు కలవటం.. ఒక చోటకు చేరి మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది.

వారి తాజా చర్చల్లో ఏపీ రాజకీయ పరిణామాలు.. వైఎస్ వివేకా హత్య కేసు.. బయటకు వస్తున్న పలువురి వాంగ్మూలాలు.. జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ వేస్తున్న అడుగులు లాంటి అంశాలు చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే దానికి తాజా భేటీ నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ఏమైనా.. చంద్రబాబు - కేవీపీ భేటీ ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Tags:    

Similar News