చంద్ర‌బాబు అడిగింది చేసిన జ‌గ‌న్‌!

Update: 2022-04-04 05:47 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత రాజ‌కీయ వైరం ఉంది. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేశార‌ని బాబు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు అన్యాయంగా కేసులు పెట్ట‌డం.. పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు.. ఇలా టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్లుగా పొలిటిక‌ల్ వార్ సాగుతోంది. కానీ తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అడిగిన కోరిక జ‌గ‌న్ తీర్చారు. అవును.. అది నిజ‌మే. ఈ రోజు నుంచి ఏపీలో కొత్త జిల్లాల నుంచి పాల‌న మొద‌లైంది. వ‌ర్చువ‌ల్ విధానంలో తాడేప‌ల్లిగూడెం నుంచి జ‌గ‌న్ కొత్త జిల్లాల‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా కుప్పం రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటుపై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.కుప్పం నుంచి గెలిచిన చంద్ర‌బాబు ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. బాబుకు పెట్ట‌ని కోట కుప్పం. అయితే తాజాగా కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి మేర‌కు దాన్ని రెవెన్యూ డివిజ‌న్ చేశామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.

కుప్పం స్థానిక ఎమ్మెల్యే అంటే ఇంకెవ‌రు బాబునే. 14 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్నా స‌రే రెవెన్యూ డివిజ‌న్ కూడా చేసుకోలేక‌పోయార‌ని జ‌గ‌న్ తెలిపారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కోర‌డంతోనే దాన్ని రెవెన్యూ డివిజ‌న్ చేశామ‌ని చెప్పారు. ఇలా మొత్తానికి చంద్ర‌బాబు కోరిక జ‌గ‌న్ తీర్చాడ‌న్న‌మాట‌.

ఏపీలో 13గా ఉన్న జిల్లాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం 26గా చేసింది. వివిధ పార్టీలు, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత జ‌గ‌న్ తుది నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 21 రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

అలాగే ప్ర‌తి 15 ఎక‌రాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాల‌యాలు ఏర్పాటు చేశామ‌న్నారు. ప్ర‌జ‌ల విజ్ఞ‌ప్తితో జిల్లాల్లోనూ కొన్ని మార్పులు చేశామ‌ని వెల్ల‌డించారు. 12 నియోజ‌క‌వ‌ర్గాల్లోని మండ‌లాల‌ను వేరు చేసి రెండు జిల్లాల్లో పెట్టాల్సి వ‌చ్చిందని వివ‌రించారు. విజ‌య‌వాడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News