వాళ్లకో దండం వదిలేయండన్న చంద్రబాబు

Update: 2015-10-29 09:09 GMT
పేరుకే మిత్రపక్షంగా ఉన్నా టీడీపీకి చుక్కలు చూపిస్తున్న బీజేపీతో చంద్రబాబు విసిగిపోయినట్లుగా కనిపిస్తున్నారు. రాష్ర్టానికి సంబంధించిన అనేక అంశాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అవసరాలు ఉన్నందున చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే... దాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారో ఏమో కానీ ఏపీ బీజేపీ నేతలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.  చంద్రబాబు తానేమీ అనకుండా - తన పార్టీ మంత్రులు - నేతలు కూడా పెద్దగా ఏమీ అనుకుండా సంయమనం పాటిస్తున్నకొద్దీ కొందరు బీజేపీ నేతలు రోజూ ప్రభుత్వం - చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇది నిత్య తలనొప్పిగా మారుతుండడంతో కొందరు టీడీపీ నేతలు కూడా అప్పుడప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే... చంద్రబాబు మాత్రం వారిని వారిస్తున్నారు. బీజేపీ నేతలు ఏమన్నా కూడా వారిని పట్టించుకోవద్దని ఆయన సొంత పార్టీ నేతలకు సూచించారు.

ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు బీజేపీ విషయంలో కామ్ గా ఉండాలని వారికి సూచించారు. స్వీయనియంత్రణ పాటించాలని చెబుతూ.. ఒకవేళ బీజేపీ నేతలు ఏమైనా అన్నప్పటికీ మీడియా ముందు దానిపై స్పందించకుండా సర్దుకుపోవాలని చంద్రబాబు ఆదేశించారు. విమర్శల వల్ల రెండు పార్టీల మైత్రికి దెబ్బ పడుతుందని చెప్పారు. మిత్రపక్షాలుగా ఉన్నవారం ఒకరినొకరు తిట్టుకుంటే చులకనవుతామని అన్నారు.

అయితే చంద్రబాబు సూచనలకు టీడీపీ నేతలు తలూపినా లోలోపల మాత్రం రగిలిపోతున్నారట. తాము ఎంత సంయమనంగా ఉన్నా బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని... ఏకంగా చంద్రబాబునే తిడుతుంటే విని ఎలా ఊరుకోవాలని అంటున్నారు. ఇలా సర్దుకుపోతున్నందుకే వారు రోజురోజుకీ ఎక్కువ చేస్తున్నారని కొందరు బహిరంగంగానే అంటున్నారు.
Tags:    

Similar News