సారీ చంద్ర‌బాబు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే సోద‌రుడు

Update: 2022-11-29 05:33 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు అనంత‌పురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి అన్న‌య్య  చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.  ఈ నెల 24వ తేదీన రాప్తాడు ఎంపీడీఓ కార్యాల‌యంలో  ఆయ‌న టీడీపీ నేత నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్‌ల‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం సృష్టించాయి. ఆ వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌మై సామాజిక మాధ్య‌మంలో వైర‌ల్ అయ్యాయి.  

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అప్ప‌ట్లో మొద్దుశీనుకు ఒక్క మాట చెప్పుంటే చంద్ర‌బాబును ఆయ‌న ఇంట్లోకి దూరి చంపేసేవాడ‌ని తోపుద‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం సృష్టించాయి.  దీనిపై తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భ‌గ్గుమ‌న్నాయి. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హించాయి. వైసీపీ నేత‌ల హ‌త్యా రాజ‌కీయాల‌ను తెలుగుదేశం శ్రేణులు దుయ్య‌బ‌ట్టాయి. రాష్ట్రంలోని ప‌లు చోట్ల తెలుగుదేశం పార్టీ నేత‌లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్‌ రెడ్డి అన్న‌య్య తోపుదుర్తి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిపైన కేసులు పెట్టారు.

ఈ వ్యాఖ్య‌ల‌తో అనంత‌పురం జిల్లా గ‌త రెండు మూడు రోజులుగా అట్టుడికి పోతోంది. ముఖ్యంగా ప‌రిటాల ర‌వి కుటుంబం తోపుదుర్తి కుటుంబానికి మ‌ధ్య రాప్తాడులో ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం ఉంది. ప‌రిటాల సునీత‌, ఆమె త‌న‌యుడు ప‌రిటాల శ్రీరామ్‌లు రాప్తాడులో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగారు.  వేలాది మంది త‌మ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌తో రాప్తాడు పోలీసు స్టేష‌న్‌కు  త‌ర‌లి వ‌చ్చి ధ‌ర్నా చేశారు. ఎమ్మెల్యే సోద‌రుడ్ని అరెస్టు చేయాల‌ని డిమాండు చేశారు.  దీనికి పోటీగా వైసీపీ ఎమ్మెల్యే అనుచ‌రులు, అభిమానులు కూడా పెద్దఎత్తున పోటీ ధ‌ర్నాలు చేశారు.

ఈ పోటా పోటీ ధ‌ర్నాలు, ఆందోళ‌న‌ల‌తు రెండు రోజులుగా అనంత‌పురం జిల్లా, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం అట్టుడికిపోతోంది. తీవ్ర ఉద్రిక‌త్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  త‌న అన్న మాట‌ల‌ను వైసీపీ ఎమ్మెల్యే ప‌రోక్షంగా వెన‌కేసుకు వ‌చ్చారు.

ఆయ‌న వాడిన భాష త‌ప్పు కానీ, భావంలో మాత్రం ఎలాంటి త‌ప్పు లేద‌న్న మాట‌లు వివాదానికి మ‌రింత ఆజ్యం పోశాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం కూడా రెండు వ‌ర్గాలు పోటాపోటీ ర్యాలీలు, ఆందోళ‌న‌ల‌తో హ‌రెత్తించాయి.  ఈ నేప‌థ్యంలో ఈ వివాదాన్ని మ‌రింత సాగ‌దీయ‌కుండా ఉండేలా అటు పోలీసులు, ఇటు వైసీపీ అధినాయ‌త్వం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డితో మంత‌నాలు సాగించాయి. చివ‌ర‌కు తోపుదుర్తి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి త‌న అభిమానులు, ప్ర‌జ‌ల‌తో క‌లిసి జిల్లా ఎస్పీని క‌లిగి తాను చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

త‌మ విధానాలు చెప్పే క్ర‌మంలో  చంద్ర‌బాబు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై ఆవేద‌న‌తో ఏదైనా మాట్లాడి ఉంటే ఈ ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌, పార్టీ శ్రేణుల త‌ర‌ఫున తాను క్ష‌మాప‌ణ కోరుతున్నాన‌ని తెలిపారు. త‌న బాధ‌ను మీడియా ద్వారా వెల్ల‌డించాల‌ని అనుకున్నాని అందుకే జిల్లా ఎస్పీని క‌లిశాన‌ని చెప్పారు.  త‌న వ్యాఖ్య‌లు బాధ క‌లిగించి ఉంటే క్ష‌మాణ‌లు కోరుతున్నాని తెలిపారు.  ఐటీడీపీ వారు ఇక్క‌డ కొంత‌మందికి డ‌బ్బులు ఇచ్చి త‌న‌పైనా త‌న కుటుంబ స‌భ్యుల‌పైన ప‌నిగ‌ట్టుకుని కామెంట్లు పెట్టిస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి అన్న‌య్య క్ష‌మాణ‌లు చెప్ప‌డంతో ఈ వివాదం ఇంత‌టితో ముగుస్తుంద‌ని అనంత‌పురం జిల్లా ప్ర‌జ‌లు ఆశిస్తున్నారు. మ‌రి తెలుగుదేశం పార్టీ వారు, ప‌రిటాల కుటుంబం దీనిపైన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News