విక్రమ్ చాఫ్టర్ క్లోజ్.. ఏమైనా చాన్స్ ఉందా?

Update: 2019-09-21 05:28 GMT
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2లో కీలకమైన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ఫెయిల్ కావటం.. హార్డ్ ల్యాండింగ్ తో సిగ్నలింగ్ సమస్యను ఎదుర్కోవటం తెలిసిందే. గడిచిన పద్నాలుగు రోజులుగా విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవేమీ ఫలించలేదు. ఈ ఉదయం (శనివారం) నుంచి చంద్రుడిపై రాత్రి మొదలైన నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్ పై ఉన్న ఆశలు వదులుకోవాల్సిందేనన్న మాట వినిపిస్తోంది.

ఈ రోజు ఉదయం నుంచి చంద్రుడి దక్షిణ ధ్రువంలో మైనస్ 200 డిగ్రీలకు ఉష్ణోగ్రతలకు పడిపోనుంది. విక్రమ్ ల్యాండర్ ఈ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే అవకాశం లేదు. దీంతో.. విక్రమ్ చాఫ్టర్ క్లోజ్ అయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రయాన్ ఆర్బిటర్ లోని కెమేరాలు తీసిన ఫోటోల ప్రకారం.. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ 200 కి.మీ. వేగంతో ల్యాండ్ అయినట్లుగా స్పష్టమవుతుంది.

తాజాగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరో 14 రోజులు తర్వాత మాత్రమే విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని ఫోటోలో తీయటానికి వెసులుబాటు ఉంది. ల్యాండింగ్ తర్వాత తీసిన ఫోటోలో విక్రమ్ నీడలాంటిది తమకు కనిపించిందని.. అది నాలుగు కాళ్లపైన నిలబడి లేదన్న విషయాన్ని ఒక శాస్త్రవేత్త ఒక మీడియా సంస్థకు వెల్లడించారు.

విక్రమ్ ల్యాండర్ ఒక పక్కకు ఒరిగిపోవటం కానీ.. బోల్తా పడి కానీ ఉండొచ్చని.. పూర్తిగా డ్యామేజ్ అయితే మాత్రం జరిగి ఉండకపోవచ్చన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం విక్రమ్ ల్యాండర్  మీద ఆశలు వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు. 14 రోజుల తర్వాత చంద్రుడిపై తిరిగి సూర్యోదయం కానున్న వేళ..విక్రమ్ ఆచూకీ మీద మరింత సమాచారాన్ని సేకరించే వీలుందంటున్నారు.
Tags:    

Similar News