ఆఖ‌ర్లో అనుకోని ట్విస్ట్‌: ఆగిన చంద్ర‌యాన్-2

Update: 2019-07-15 04:17 GMT
న‌రాలు తెగేలా సాగిన క్రికెట్ వ‌ర‌ల్డ్ కప్ ఫైన‌ల్స్ ను చూసిన భార‌తీయులు అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు. అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత సోమ‌వారం తెల్ల‌వారుజామున మూడు గంట‌లు కావ‌టానికి తొమ్మిది నిమిషాల ముందు అంటే.. 2.51 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌తిష్ఠాత్మ‌క చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం జ‌ర‌గాల్సి ఉంది. తాము నిద్ర లేచేస‌రికి స్వీట్ న్యూస్ రెఢీగా ఉంటుంద‌ని భావించిన వారంద‌రికి ఊహించ‌ని ట్విస్ట్ ఇస్తూ.. ఈ ప్ర‌యోగాన్ని చివ‌ర్లో నిలిపివేశారు.

ప్ర‌యోగాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు రాష్ట్రప‌తి కోవింద్ స్వ‌యంగా హాజ‌రు కావ‌టం.. ప్ర‌యోగానికి స‌రిగ్గా 56 నిమిషాల 24 సెక‌న్ల‌కు ముందు కౌంట్ డౌన్ ను నిలిపివేశారు. ఇది జ‌రిగిన రెండు మూడు నిమిషాల‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాన్ని కూడా ఆపేశారు. మ‌ళ్లీ ఈ ప్ర‌యోగాన్ని ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌న్న విష‌యాన్ని ఇస్రో అధికారికంగా వెల్ల‌డించ‌లేదు.

కొన్ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం సోమ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాతే ప్ర‌యోగాన్ని నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నా.. అలాంటి అవ‌కాశాలు త‌క్కువేన‌ని చెబుతున్నారు. మొత్తంగా చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం ఇప్ప‌టికైతే ఆగిపోయిన‌ట్లే.

షెడ్యూల్ ప్ర‌కారం చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం జ‌రిగి ఉంటే ఈ పాటికి అది త‌న‌కు ముందే ఫిక్స్ చేసిన నిర్దిష్ట క‌క్ష్య‌లో ఉండేది. ఎందుకంటే ప్ర‌యోగం జ‌రిగిన 16.13 నిమిషాల వ్య‌వ‌ధిలోనే క‌క్ష్య‌లో వెళ్లి ఉండాల్సింది. ఇదిలా ఉంటే.. ప్ర‌యోగం మ‌ళ్లీ ఎప్పుడు నిర్వ‌హిస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌.

అంత‌రిక్ష ప్ర‌యోగాల కోసం లాంచ్ విండోలోనే వ్యోమోనౌక‌ను ప్ర‌యోగించాల్సి ఉంటుంది.  స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే అంత‌ర‌క్షి ప్ర‌యోగాల్ని జ‌ర‌పాలి. ముందుగా నిర్ణ‌యించిన స‌మ‌యంలో ప్ర‌యోగాన్ని నిర్వ‌హించ‌ని ప‌క్షంలో.. అనుకూల లాంచ్ విండో వేళ వ‌ర‌కూ ఆగాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం అనుకున్న షెడ్యూల్ కు ప్ర‌యోగం జ‌ర‌గ‌ని నేప‌థ్యంలో.. ఈ నెల‌లో ప్ర‌యోగం జ‌ర‌గ‌టం అనుమాన‌మే అంటున్నారు.

ఎందుకంటే ఈ నెల‌లో లాంచ్ విండోల వ్య‌వ‌ధి కేవ‌లం నిమిషం పాటే ఉన్నాయి.సోమ‌వారం నాటి లాంచ్ విండో ఏకంగా ప‌ది నిమిషాల స‌మ‌యం ఉంది. స్వ‌ల్ప వ్య‌వ‌దైన‌ నిమిషం లాంచ్ విండో వేళ‌లో ప్ర‌యోగాన్ని నిర్వ‌హించ‌టం చాలా అరుదుగా చెబుతుంటారు.

ఈ ప్ర‌యోగాన్ని ప్ర‌త్య‌క్షంగా చూడ‌టానికి వ‌చ్చిన రాష్ట్రప‌తి కోవింద్ షార్ లో రూ.629 కోట్ల‌తో నిర్వ‌హించిన రెండో వాహ‌న అనుసంధాన భ‌వ‌నాన్ని జాతికి అంకితం చేశారు. అనంత‌రం రెండో ప్ర‌యోగ వేదిక వ‌ద్ద‌కు ప్ర‌త్యేక వాహ‌నంలో వెళ్లిన రాష్ట్రప‌తి చంద్ర‌యాన్-2 ఉప‌గ్ర‌హాన్ని పంప‌నున్న జీఎస్ ఎల్ వీ-మార్క్ 3-ఎం1 వాహ‌న నౌక వ‌ద్ద ఇస్రో అధినేత‌తో క‌లిసి ఫోటో దిగారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత ప్ర‌యోగం ఆగిపోవ‌టం తీవ్ర నిరాశ‌కు గురి చేసేదే.

ఇంత‌కీ.. ఈ ప్ర‌యోగం ఆఖ‌రి నిమిషాల్లో ఎందుకు నిలిచిపోయింది? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే.. అనూహ్యంగా త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌లేన‌ని చెబుతున్నారు. సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో ప్ర‌యోగాన్ని నిలిపామ‌ని.. త‌దుప‌రి తేదీని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లుగా ఇస్రో అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. త‌న ప్ర‌యోగాల్లో అత్య‌ధికం విజ‌యవంతంగా నిర్వ‌హించే ఇస్రో.. ప్రతిష్ఠాత్మ‌కంగా సాగే ప్రాజెక్టుల ప్ర‌యోగాన్ని ఆఖ‌రి నిమిషాల్లో ఆపేయ‌టం చాలా అరుదుగా జ‌రుగుతుంద‌ని చెప్పాలి.
Tags:    

Similar News