రైతుల కోసం బాబు ఏం చేశారంటే....

Update: 2015-09-30 09:28 GMT
అనంతపురం జిల్లా కొత్తచెరువులో 'రైతు కోసం చంద్రన్న' యాత్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రన్న విజయాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేస్తున్నదని చెప్పారు. దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లా అనంతపురం - అనంతపురం నుంచే వలసలు ఎక్కువగా జరిగాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అనంతలో కరవును పారద్రోలడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు.

అనంత కరవును పారద్రోలడానికి ఎన్టీఆర్ హయాంలో గాలేరు, నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు. నదుల అనుసంధానంతో అనంతపురంలో కరువు మాయమ‌వుతుందని చంద్రబాబు ధీమా వ్య‌క్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్ర‌భుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన వివరించారు. రైతుల కోసం పెట్టుబడి రాయతీ, బీమా సౌకర్యం కల్పిస్తున్నమ‌ని తెలిపారు. అలాగే ట్రాక్టర్లు, యంత్రాలకు 75శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే వరకూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కరవు శాశ్వత నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్ర‌తిప‌క్షాలు అవాస్త‌వాలు ప్ర‌చారం చేసినా...న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు అక్క‌డి రైతులు భూముల  ఇచ్చార‌ని, వారికి ఏపీ ప్ర‌జ‌లంతా రుణ‌ప‌డి ఉంటార‌ని అన్నారు. భ‌విష్య‌త్తులో ప్ర‌తి తెలుగువాడు గ‌ర్వ‌ప‌డేలా అమ‌రావ‌తి నిర్మాణం ఉంటుంద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News