హుజూరాబాద్ ఉప ఎన్నికపై మారిన కాంగ్రెస్ వ్యూహం

Update: 2021-09-01 14:30 GMT
అనూహ్యంగా ఏర్పడిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీ తరుపున ఈటల రాజేందర్ పోటీకి కత్తులు నూరుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడి ఉంది. టీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులతో ప్రచారంలో ఊపు తెస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ తమ క్యాండెట్ ను ప్రకటించలేదు. నిన్నటి వరకు పలువురి పేర్లు వినబడగా.. తాజాగా గాంధీ భవన్లో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం కలుగుతోంది.

దుబ్బాక ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఈ ఎన్నికలో మూడోస్థానానికి పడిపోగా ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసినా డిపిజిట్లు తెచ్చుకునేవరకు మాత్రమే పోరాడగలిగింది. దీంతో అధిష్టానం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని డిసైడ్ అయింది. దీంతో అప్పటికే యూత్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పారు. అయితే రేవంత్ ఎంపికపై పార్టీలోని చాలా మంది సీనియర్లు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే ఢిల్లీ పెద్దలు ధైర్యం చేసి రేవంత్ రెడ్డికి పార్టీని అప్పజెప్పారు.

పీసీసీ పోస్టు రేవంత్ రెడ్డికి ఇవ్వగానే తన ఎంపిక కరెక్ట్ కాదనే భావన రాకుండా దూకుడు పెంచారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ అలజడి సృష్టించారు. అసంతృప్తి నేతలను కలుస్తూ వారిని బుజ్జగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధుకు ప్రత్యామ్నాయంగా గిరిజన దండోరా సభలను నిర్వహిస్తున్నారు. వీటన్నింటిని చూస్తున్న పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కొందరు మొన్నటి వరకు పార్టీకి దూరం అయిన వారు సైతం తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. అయితే ఆ మధ్య కాంగ్రెస్ గుర్తుమీద గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం చేపడుతామని ప్రకటించారు. మొత్తం మీద స్తబ్ధంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో రేవంత్ రెడ్డి ఉత్సాహాన్ని నింపారు.

ఈ జోష్ తో హూజూరాబాద్ ఉప ఎన్నికలోనూ పోటీ చేసుందకు కాంగ్రెస్ సై అంది. ఇందులో భాగంగా ఇప్పటికే అక్కడ సభలు, సమావేశాలు నిర్వహించారు. పాత క్యాడర్ నంతా ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గెలుపోటములు పక్కనబెడితే పార్టీ ప్రభావం చూపాలన్న ధ్యేయంతో పార్టీ నాయకులు కష్టపడుతున్నారు. ఇకి నియోజకవర్గ బాధ్యతలను దామోదర నర్సింహకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ ఠాగూర్ పర్యవేక్షిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ నుంచి పోటీలో ఎవరుంటారు..? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. టీఆర్ఎస్, బీజేపీలు బీసీ అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థి అయిన పొన్నం ప్రభాకర్ ను సంప్రదించారు. అయితే ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిన ఆయన మరోసారి ఓడిపోతే కెరీర్ పై ప్రభావం ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇక కొండా సురేఖ పేరు వినబడుతున్నా.. ఆమె షరతులతో మాత్రమే ఒప్పుకుంటానంటోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికోసం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు అభ్యర్థికి గాంధీ భవన్ లో ఓ కౌంటర్ పెట్టారు. బుధవారం నుంచి 5వ తేదీ వరకు ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేరసుకోవాలని వెల్లడించింది. అంతేకాకుండా రూ. 5 వేలు డీడీ కట్టాలని కూడా తెలిపింది. అంటే హుజూరాబాద్లో కాంగ్రెస్ తరుపు పోటీ చేయడానికి ఎవరైనా ముందుకు రావచ్చు అని ప్రకటించారన్నమాట. అంటే వందేళ్ల చరిత్రి కలిగిన కాంగ్రెస్ కు హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రంలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.



Tags:    

Similar News