కేసీఆర్‌ మీద వారిక కత్తులు నూరుతారా?

Update: 2016-04-12 03:55 GMT
ఒక చిన్న పరిణామం తాలూకు పర్యవసానాలు ఎలా ఉంటాయో అంత సులువుగా అంచనా వేయడం కష్టం. తెలంగాణకు సంబంధించినంత వరకు ఏ సందర్భంలో ఎలాంటి అవసరం వస్తుందో అనే ఉద్దేశంతో అధికార తెరాస పార్టీ పాతబస్తీలో, హైదరాబాదు నగరంలో కొంత బలం కలిగిఉన్న ఎంఐఎం పార్టీతో అప్రకటిత దోస్తీని కొంతకాలం కొనసాగిస్తూ వచ్చింది. వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఒక దశలో ఆ పార్టీకి చెందిన బ్రదర్స్‌ - తెరాస సర్కారు స్టీరింగ్‌ తమ చేతిలో ఉన్నదని బహిరంగంగా వ్యాఖ్యానించినప్పటికీ మిన్నకున్నది. అయితే ఇప్పుడు తాజాగా సర్కారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఎంఐఎంతో దోస్తీ కటీఫ్‌ అయ్యే వాతావరణాన్ని కల్పిస్తున్నాయా అనే సంకేతాలు ఇస్తున్నాయి. ముందుముందు ఎంఐఎం కూడా అన్ని ఇతర ప్రతిపక్షాల లాగానే కేసీఆర్‌ మీద కత్తులు నూరుతూ విరుచుకుపడే పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు.

విషయం ఏంటంటే.. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్‌ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ లో ప్రసంగించారంటూ 2013లో పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్లవుతున్నా చార్జిషీటు మాత్రం దాఖలు కాలేదు. అక్బరుద్దీన్‌ ఎమ్మెల్యే కావడం, చార్జిషీటు దాఖలుకు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో.. మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. చార్జిషీటులో ఇంత జాప్యమా అంటూ మధ్యలో ఒక పిల్‌ కూడా హైకోర్టులో పడింది. దానిమీద కూడా విచారణ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ప్రాసిక్యూషన్‌ కు వీలుగా ప్రభుత్వం విచారణకు అనుమతించడంతో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఎంఐఎంతో ప్రభుత్వ పార్టీకి ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఈ పాత కేసులో ఆయన ప్రాసిక్యూషన్‌ కు అనుమతించడం ఒక రకంగా తీవ్రమైన నిర్ణయంగానే పరిగణించాలి. ఎంఐఎం మీద ఇక తాము ఆధారపడవలసిన పరిస్థితి ఎంతమాత్రమూ లేదనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతే కేసీఆర్‌ సర్కారు ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చుననేది విశ్లేషకుల వాదన. అందుకే ఎంఐఎం కూడా కొత్తగా కేసీఆర్‌ మీద కత్తులు నూరడం ప్రారంభిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News