కరోనాకి కరోనాతో చెక్... నకిలీ వైరస్ తయారీ...ఏం చేస్తారంటే ?

Update: 2021-07-14 07:56 GMT
కరోనా వైరస్ .. కరోనా వైరస్ .. ఏం వైరసో ఏమో కానీ , మానవ జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ప్రస్తుతం ఎక్కడ , ఏం మాట్లాడిన కూడా కరోనా కి ముందు , కరోనా కి తర్వాత అని మాట్లాడుతున్నారు. అంతలా కరోనా మానవ జీవితాన్ని మార్చేసింది. ఇకపోతే , కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే , ఆ వ్యాక్సిన్ల తో కరోనా మహమ్మారి పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కూడా తాత్కాలిక రక్షణ కోసమే కానీ , కరోనా ను పూర్తిగా అంతం చేయలేకపోతున్నాయి.

ఈ తరుణంలో ముల్లును ముల్లుతోనే తీయాలి అనే పెద్దలు చెప్పిన  సామెత ను గుర్తు చేసుకొని మాన‌వ శ‌రీరంలో యాంటీబాడీల‌ను ఏమార్చి ఇన్‌ ఫెక్ష‌న్ల‌ను క‌లుగ‌జేస్తున్న క‌రోనా వైర‌స్‌ను బోల్తాకొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్ర‌వేత్త‌లు అభివృద్ధి చేశారు. ఇది నిజమైన కరోనా లాగే ఉంటుంది. కాకపోతే  కాస్త చిన్నగా ఉంటుంది. ఇది నిజమైన కరోనాను మోసం చేసి... పెరగకుండా ఆపేస్తుంది. ఇదెలా జరుగుతుందో తెలియాలంటే , అసలు నిజమైన కరోనా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అసలు విషయం మొదలు అవుతుంది.  

నిజమైన కరోనా వైరస్ మనిషి శరీరంలోకి వెళ్లాక, ఏదో ఒక కణానికి అతుక్కుంటుంది. అలా అతుక్కునేలా  కరోనా చుట్టూ, జిగురు లాంటి కొవ్వు పదార్థం ఉంటుంది. అలా అతుక్కున్న కరోనా  తన జన్యు పదార్థాన్ని కణంలోకి పంపిస్తుంది. దాంతో  ఆ కణం వైరస్ వశం అవుతుంది. కణానికి అందే శక్తిని, ఆహారాన్నీ కరోనా తీసుకుంటుంది. దాంతో  వైరస్  తనకు ఇల్లు దొరికినట్లుగా ఫీలవుతుంది. ఇక ఆ కణంలో ఉంటూ  మరిన్ని కరోనా వైరస్‌లను సృష్టిస్తుంది. అలా పుట్టిన కరోనా వైరస్‌లు మరిన్ని కణాలను అతుక్కుంటాయి. ఇలా కరోనా వైరస్ సంఖ్య పెరుగుతూ పోతుంది. అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ  సైంటిస్టులు, డిఫెక్టివ్ ఇంటర్‌ఫియరింగ్ విధానంలో  డూప్లికేట్ కరోనాను తయారుచేశారు. ఈ కరోనాను మనిషి శరీరంలోకి పంపుతారు.

ఇది బాడీలోకి వెళ్లాక,నిజమైన వైరస్ వృద్ధి చెందకుండా చేస్తుంది. దాని పునరుత్పత్తిని ఆపేస్తుంది. దీనితో నిజమైన వైరస్  క్రమంగా తగ్గిపోతుంది. ఇక  డూప్లికేట్ వైరస్ చాలా చిన్నగా ఉంటుంది... ఒరిజినల్ వైరస్ కంటే 90 శాతం చిన్నగా ఉంటుంది. అందువల్ల ఇది మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందుతుంది. అందువల్ల ఒరిజినల్ వైరస్ ఒక్క రోజులోనే సగానికి తగ్గిపోతుంది. రెండు రోజులకే పూర్తిగా పోతుంది. ఆ తర్వాత డూప్లికేట్ వైరస్ కూడా దానంతట అదే చచ్చిపోతుంది. ఈ పరిశోధన వివరాల్ని జర్నల్ పీర్జే లో రాశారు. కాకుంటే, కృత్రిమ వైర‌స్ అస‌లైన క‌రోనా వైర‌స్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది.  కృత్రిమ వైర‌స్ జ‌న్యుఉత్ప‌త్తి వేగంగా జ‌ర‌గ‌డంతో అసలైన వైర‌స్ ఉత్ప‌త్తి వేగం త‌గ్గిపోతుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  త్వరలోనే ఈ డూప్లికేట్ వైరస్‌ని కరోనా సోకిన మానవుల ఊపిరితిత్తుల కణాల్లో ప్రవేశపెట్టి... ఫలితాలు ఎలా ఉంటాయో చూడనున్నారు.
Tags:    

Similar News