నాయిని అల్లుడి ఇంట్లో కళ్లు చెదిరే స్థాయిలో నోట్ల కట్టలు

Update: 2021-04-11 04:24 GMT
వంగత మాజీ రాష్ట్ర హోం మంత్రి కమ్ ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ఇప్పటివరకు బీమా వైద్య సేవల విభాగంలోని అధికారులకే పరిమితమైందని భావించిన అవినీతి భాగోతంలో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న విషయం తాజాగా తేలింది. ఈ స్కాంలో నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి భాగస్వామ్యం ఉందన్న అనుమానంతో ఆయన ఇంట్లో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్ లోని ఏడు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి నిర్వహించిన తనిఖీల్లో కళ్లు చెదిరేలా నోట్ల కట్టలు బయటకొచ్చాయి.

సుమారు రూ.3కోట్ల నగదు.. కోటిరూపాయిలు విలువైన బంగారు.. వెండి ఆభరణాలు.. ఖాళీ చెక్కులు.. పెద్ద ఎత్తున ఆస్తుల రిజిస్ట్రేషన్ పేపర్లు.. హార్డ్ డిస్క్ లు.. పెన్ డ్రైవ్ లు తదితరాల్ని అధికారులు గుర్తించారు. నాయిని అల్లుడితో పాటు నాయిని మాజీ పీఏ ముకుందరెడ్డి (ప్రస్తుతం ఇతడు రాష్ట్ర రోడ్లు.. భవనాల శాఖా మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు).. ఇతడి బంధువు వినయ్ రెడ్డి.. ఐఎంఎస్ స్కాంలో ప్రధాన సూత్రధారి డాక్టర్. దేవికా రాణి.. ఓమ్ని మోడీ సంస్థ నిర్వాహఖుడు శ్రీహరిబాబులకు చెందిన ఇళ్లు.. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఏడు చోట్ల జరిగిన ఈ సోదాల్లో భారీగా నగదు బయటపడింది. ఇదంతా లెక్కల్లో చూపించని మొత్తంగా అధికారులు గుర్తించారు.

కార్మికశాఖ పరిధిలోని ఐఎంఎస్ విభాగంలో జరిగిన ఈ స్కాం జరిగింది. అప్పట్లో ఈ శాఖకు మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి ఉండేవారు. ఈ విభాగం పరిధిలోని డిస్పెన్సరీల్లో మందుల కొనుగోళ్లకు.. రోగులకు సేవలు అందించేందుకు 2016 నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటి నుంచి పెద్ద మొత్తం దారి మళ్లినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఉదంతానికి సంబంధించి ఈడీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాదాపు రూ.200 కోట్ల మేర ఆక్రమాలు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ విభాగం డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి.. ఆమె భర్త గురుమూర్తితో పాటు పలువురు ఉద్యోగుల్ని అరెస్టు చేశారు. ఈ స్కాంలో పెద్ద తలకాయల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమైనా.. ఆ దిశగా విచారణ జరగలేదన్న విమర్శ ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈడీ జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు లభ్యం కావటంతో నాయిని అల్లుడి పొలిటికల్ కెరీర్ ఖతమైనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీల్లో తనకు సీటు ఖాయం చేయాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును ఆశించినప్పటికి మొండిచేయే మిగిలింది. తాజాగా జరిపిన సోదాల్లో ఇంత భారీగా ఆస్తులు బయటపడిన తర్వాత సీఎం కేసీఆర్ పదవులు కట్టబెట్టే అవకాశం లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News