మ‌ళ్లీ ఆ దేశంలో లాక్‌డౌన్.. ఆరున్న‌ర కోట్ల మందిపై ప్ర‌భావం!

Update: 2022-09-07 07:43 GMT
క‌రోనా పుట్టినిల్లు చైనాలో మ‌ళ్లీ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో ఇప్ప‌టికే లాక్‌డౌన్‌ల మీద లాక్‌డౌనులు విధించింది.. ఆ దేశం. అయితే జీరో కోవిడ్ కేసులే ల‌క్ష్యంగా మ‌రోమారు లాక్‌డౌన్ విధిస్తోంది.

సెప్టెంబ‌ర్ 6న‌ చైనాలో 1552 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. నిత్యం 1500 కేసుల‌కు త‌గ్గ‌డం లేదు. దీంతో ఒక్క కోవిడ్ కేసు లేకుండా చేయ‌డానికి ఇప్ప‌టికే అనేకమార్లు లాక్‌డౌన్ విధించింది. ప్ర‌స్తుతం జీరో కోవిడ్ కేసులే లక్ష్యంగా ఏకంగా 33 న‌గ‌రాల్లో లాక్‌డౌన్ విధించింది. దీనివల్ల ఆరున్న‌ర కోట్ల మందిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

సెప్టెంబ‌ర్ 10 నుంచి 12 వ‌ర‌కు చైనాలో కొత్త సంవ‌త్స‌రం సెల‌వులు. దీంతో ప్ర‌యాణాలు ఎక్కువ అవుతాయ‌ని, ప్ర‌జ‌లు ఒక చోట నుంచి ఇంకో చోట‌కు ప్ర‌యాణిస్తుంటార‌ని.. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధిస్తున్నామ‌ని తెలిపింది. అయితే కోవిడ్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న నైరుతి చైనాలోనే లాక్‌డౌన్ అమ‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. లాక్‌డౌన్ ప్ర‌భావం ఏకంగా ఆరున్న‌ర కోట్ల మందిపై ప‌డుతుంద‌ని అంటున్నారు.

లాక్‌డౌన్ ప్ర‌భావంతో నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగ్డు నగరవాసులు తమ నివాసాల‌కే పరిమితమయ్యారు. చైనా తూర్పున నౌకా నగరమైన టియాంజిన్‌లో 14 కొత్త కేసులు వ‌చ్చాయి. దీంతో అక్క‌డ కూడా లాక్‌డౌన్ విధించారు. ప్రస్తుతం 33 నగరాల్లో ఆంక్షలు విధించినట్లు చైనాకు చెందిన‌ అధికార వార్తాసంస్థలు తెలిపాయి.

సెప్టెంబ‌ర్ 6న‌ చైనాలో కొత్తగా 1,552 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఆ దేశ‌ జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్ల‌డించింది. ఈ సంఖ్య తక్కువే అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వం తన 'జీరో-కొవిడ్‌' విధానంలో భాగంగా లాక్‌డౌన్‌లు, క్వారంటైన్లు విధిస్తోంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ, రవాణా రంగం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వ్యాపారాలు సాగ‌డం లేద‌ని.. ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నామ‌ని వ్యాపారులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఇక పారిశ్రామిక‌వేత్త‌ల బాధ వ‌ర్ణ‌నాతీతం. గ‌త రెండేళ్లు ప‌రిశ్ర‌మ‌ల మూత‌తో ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయాయ‌మ‌ని.. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు కుదుట‌ప‌డుతుంటే మ‌ళ్లీ లాక్ డౌన్ విధిస్తే ఈసారి తాము కోలుకోవ‌డానికి కూడా అవ‌కాశం ఉండ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News