చెన్నై సిల్క్స్ ది మ‌రీ అంత క‌క్కుర్తా?

Update: 2017-06-02 05:05 GMT
చెన్నైలోని చెన్నై సిల్క్స్ భ‌వ‌నంలో భారీ ఆగ్నిప్ర‌మాదం చోటు చేసుకోవ‌టం.. త‌ర్వాతి రోజే.. పేక‌మేడ‌లా కుప్ప‌కూలిన వైనం తెలిసిందే. ఒక ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌కు చెందిన బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నంలో ఇలాంటి ప‌రిణామాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? అన్న ప్ర‌శ్నకు స‌మాధానం వెతికితే విస్మ‌య‌క‌ర నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత వ‌చ్చే విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో.. అధికారులు ఏ తీరులో అయితే స్పందిస్తున్నారో.. తాజా ఉదంతంలోనూ అదే రీతిలో రియాక్ట్ అవుతున్నారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చెన్నై సిల్స్క్ భ‌వ‌న నిర్మాణాన్ని చేప‌ట్ట‌ట‌మే ప్ర‌మాదానికి అస‌లు కార‌ణంగా చెబుతున్నారు. సీఎండీఏ (సింఫుల్ గా చెన్నై న‌గ‌ర‌పాల సంస్థ‌) నిబంధ‌ల ప్ర‌కారం.. నాలుగు అంత‌స్థుల నిర్మాణానికి.. కారు పార్కింగ్‌ ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చిందని.. కానీ అందులో ఏడు అంత‌స్థుల్లో భ‌వ‌నాన్ని నిర్మించార‌ని చెబుతున్నారు.

చెన్నై సిల్క్స్  సంస్థ‌.. నాలుగు అంత‌స్థుల నిర్మాణానికి బ‌దులుగా.. ఏడు అంత‌స్థులు నిర్మించ‌టం.. వాహ‌నాల పార్కింగ్ స్థ‌లంలో కూడా నిర్మాణాన్ని ఏర్పాటు చేయ‌టంతో ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంద‌ని చెబుతున్నారు. చెన్నై సిల్క్స్ భ‌వ‌న నిర్మాణంలో చోటు చేసుకున్న ప్ర‌మాదం నేప‌థ్యంలో మంత్రి  ఉడుమ‌లైపెటై రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ.. నాలుగు అంత‌స్థుల నిర్మాణానికి మాత్ర‌మే అధికారులు అనుమ‌తిస్తే.. ఏడు అంత‌స్థుల్లోనిర్మాణం చేప‌ట్టార‌ని చెప్పారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మించిన తీరుపై కోర్టుకు అధికారులు వెళ్ల‌గా.. సుప్రీంకోర్టుకు వెళ్లిన స‌ద‌రు సంస్థ స్టే తెచ్చుకుంద‌ని.. అందుకే కూల్చ‌లేక‌పోయిన‌ట్లుగా చెప్పారు. త‌మ త‌ప్పేం లేద‌నట్లుగా చెప్పేసిన మంత్రివ‌ర్యుల‌కు.. పాత్రికేయులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మాత్రం స‌మాధానాలు చెప్ప‌లేక‌పోయారు. భ‌వ‌నాన్ని కూల్చ‌లేక‌పోతే పోయారు.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మించిన భ‌వ‌నానికి విద్యుత్‌.. నీటి సౌక‌ర్యం.. డ్రైనేజీ ఎలా ఏర్పాటు చేశార‌ని అడిగితే స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు. అంతేనా.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రాత్రికి రాత్రే నాలుగు అంస్థుల నుంచి ఏడు అంత‌స్థులు నిర్మించ‌రు క‌దా? క‌ట్టినంత కాలం చోద్యం చూస్తున్నట్లుగా ఎందుకు ఉండిపోయిన‌ట్లు? వ‌్య‌వ‌స్థ‌ల లోపాల్ని ఆస‌రా చేసుకొని మాత్ర‌మే త‌ప్పులు జ‌రుగుతాయన్న విష‌యం జ‌నాల‌కు తెలీద‌న్న‌ట్లుగా మంత్రిగారి స‌మాధానం చూస్తేనే.. అస‌లు విష‌యం ఏందో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News