చెవిరెడ్డి అంతర్మథనం

Update: 2016-07-11 10:00 GMT
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చిత్తూరు పోలీసులు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. వరుస కేసుల్లో జైలు నుంచి కదలకుండా చేస్తున్నారు. నానా కష్టాలు పడి బెయిలు తెచ్చుకుంటున్నా బయటకు రాగానే మరో కేసులో లోపలేస్తున్నారు. దీంతో చెవిరెడ్డి బయట ప్రపంచాన్ని చూడడమే కావడం లేదు. అయితే... ఇంత జరుగుతున్నా చెవిరెడ్డి ఘోష అధినేత జగన్ చెవికి చేరినట్లుగా లేదు. పార్టీ ఎమ్మెల్యే - అందులోనూ తన కోసం ఏ పనికైనా సిద్ధపడే చెవిరెడ్డి ని పోలీసులు ఆటాడుకుంటున్నా జగన్ ఇంతవరకు ఈవిషయంలో స్పందించలేదు. జగనే కాదు.. వైసీపీ నేతలెవరూ దీనిపై ఇంతవరకు గట్టిగా గొంతు విప్పింది లేదు. దీంతో తనకు ఇంత అన్యాయం జరుగుతున్నా జగన్ కానీ, ఇతర నేతలు కానీ స్పందించకపోవడంతో చెవిరెడ్డి చాలా ఆవేదనకు గురయినట్లు చెబుతున్నారు.

ఒక ఎమ్మెల్యేను ఇలా సింపులుగా అరెస్టు చేస్తుంటే వైసీపీ ఏమీ చేయదా అని ఆయన అన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేను అరెస్టు చేయాలంటే అనుమతులు అవసరం లేదా అన్న ప్రశ్న కూడా వేయరా అని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది.

పార్టీ కోసం - జగన్ కోసం తాను ఎంతో చేశానని.. అలాంటిది గవర్నమెంటు తనను వేధిస్తుంటే కనీసం ప్రశ్నించకపోవడం బాధ కలిగిస్తోందని చెవిరెడ్డి తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే.. జగన్ మాత్రం దీనిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గడపగడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నందున ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా డైవర్టు చేసేందుకు ఇలా చేస్తోందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో చెవిరెడ్డి ఇష్యూను తలకెత్తుకుంటే అది పెద్ద రగడగా మారుతుందని.. గడపగడప కార్యక్రమం ప్రజలకు చేరదని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. చెవిరెడ్డి మాత్రం జగన్ తీరుపై ఫీలవుతున్నారని అంటున్నారు.
Tags:    

Similar News