నీ పేటకు నేనే మేస్ర్తిని.. చెవిరెడ్డి

Update: 2016-05-18 08:22 GMT
 వైసీపీలో చురుగ్గా ఉంటున్న  చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి  టీడీపీ - చంద్రబాబులపై విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు నారావారిపల్లెకు తాను ఎమ్మెల్యేనని... ఆయన సొంతూరుకు వైసీపీ నేతనైన తాను ఎమ్మెల్యేగా ఉన్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. పాలమూరు- రంగారెడ్డి - డిండి ప్రాజెక్టులకు నిరసనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేపట్టిన జలదీక్ష నేటికి మూడో రోజుకు చేరుకున్న సందర్భంగా  దీక్షా స్థలి వద్ద మాట్లాడిన చెవిరెడ్డి కాస్త శ్రుతి మించి మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆడామగా కాని మాడాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా రాయలసీమకు చెందిన వ్యక్తేనని చెప్పిన ఆయన.. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరికి తాను ఎమ్మెల్యేనని ఆయన చెప్పుకొచ్చారు.  చంద్రబాబును నమ్మని చంద్రగిరి వాసులు జగనన్నపై విశ్వాసముంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని పేర్కొన్నారు.  

వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంపైనా ఆయన మండిపడ్డారు.  మొత్తం పాలనను పక్కనపెట్టిన చంద్రబాబు... వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని తన పార్టీలోకి చేర్చుకునే పనిలోనే నిమగ్నమయ్యారన్నారు.  వైఎస్ జగన్ గెలిపించిన వారి పట్ల అంతగా ఆసక్తి కనబరచడానికి కారణమేంటని చెవిరెడ్డి ప్రశ్నించారు. జగన్ గెలిపించిన ఎమ్మెల్యేలను చెవిరెడ్డి ‘మగాళ్లు’గా అభివర్ణించారు. జగన్ గెలిపించిన ఎమ్మెల్యేల వైపు చూస్తున్న చంద్రబాబుకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మీ పార్టీలో మగాళ్లు లేరా? మీ ఎమ్మెల్యేలంతా ఆడంగులా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతలోనే ఆయన అసలు ఆడోళ్లు కూడా కాదు ఆడామగా కాని మాడాలు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా చెవిరెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు కానీ ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కాదంటున్నారు. ఇప్పటికే ఒకసారి శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన చెవిరెడ్డి ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. దీక్ష ఎందుకు చేస్తున్నారో ఆ విషయం మరిచి మిగతా అన్ని విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News