సాలూరు ఎమ్మెల్యే కూడా జంపింగేనా?

Update: 2016-04-14 11:05 GMT
 విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర టీడీపీలో చేరుతారన్న ప్రచారం మరోసారి గట్టిగా వినిపిస్తోంది. ఇంతకుముందు కూడా ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగినా దాన్ని ఆయన కొట్టిపారేయడంతో అక్కడికి అది సద్దుమణిగింది. కానీ, తాజాగా బొబ్బిలి రాజులు టీడీపీలో చేరనున్న నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు వచ్చిన వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి - విజయసాయిరెడ్డిలు   సాలూరు వెళ్లి రాజన్న దొరతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ గురిచేసే ప్రలోభాలకు లొంగవద్దని, పార్టీ పరంగా ఏవైనా సమస్యలుంటే అధినేత జగన్ తో మాట్లాడి పరిష్కరించుకోవాలని వారు సూచించినట్టు సమాచారం. తానేమీ పార్టీ మారడం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.  అయితే.... రాజన్న దొర కూడా టీడీపీలో చేరుతారన్న బలమైన సమచారం ఉండడం వల్లే వారు ఆయన్ను కలిసి మాట్లాడారని తెలుస్తోంది.
 
కాగా, రాజన్నదొరతో చర్చల అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీలు మారేవారు రాజీనామాలు చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఆపై ఇష్టమొచ్చిన పార్టీ టికెట్ తీసుకుని తిరిగి గెలవాలని సవాల్ విసిరారు.   జగన్ పై తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తోందని మిగతా నేతలంతా మండిపడ్డారు. ఇదంతా ఎలా ఉన్నా జగన్ దూతలుగా వచ్చిన నేతలు రాజన్న దొరతో భేటీ కావడంతో ఆయన కూడా టీడీపీలో చేరడం ఖాయమన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. మిగతా వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరెవరు వెళ్లే అవకాశాలున్నాయన్న చర్చ భారీ ఎత్తున సాగుతోంది.
Tags:    

Similar News