ఫ్లెక్సీ పెట్టే చెవిరెడ్డి.. ముఖానికి మాస్కు కూడా పెట్టాలిగా?

Update: 2021-05-20 14:30 GMT
మాటలు ఎవరైనా చెబుతారు. చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటే ఎలా? జమానాలో అయితే నడిచేది. ఇప్పుడంతా వాట్సాప్.. సోషల్ మీడియా కాలం. ఏం చేసినా వెంటనే.. ఆధారంతో సహా అడ్డంగా బుక్ చేస్తారు. ఈ విషయాలన్ని ఏపీ చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలీవా? అన్నది క్వశ్చన్. ఎందుకంటే.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అందరూ మాస్కు పెట్టుకోవాలంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ ప్రచారం చేస్తున్నారు చెవిరెడ్డి.

ఇంత ప్రచారం చేసే పెద్ద మనిషి.. తనకు తాను అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ముఖానికి మాస్కు లేకుండా హాజరు కావటాన్ని చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనాలందరికి మాస్కు పెట్టుకోవాల్సిన అవసరాన్ని అంత గొప్పగా చెప్పే పెద్ద మనిషి.. తన వరకు వచ్చేసరికి మాత్రం మాస్కు పెట్టుకోకుండా అసెంబ్లీకి హాజరైన తీరును తప్పు పడుతున్నారు.

ఆ మాటకు వస్తే.. ఈ రోజు బడ్జెట్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి అధికారపక్షానికి చెందిన నేతలు మాత్రమే హాజరయ్యారు. వారిలో చాలామంది ముఖానికి మాస్కు పెట్టుకోకుండా హాజరు కావటం గమనార్హం. చివరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ముఖానికి మాస్కు పెట్టుకోలేదు.

ఓపక్క పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న వేళ.. ముఖానికి మాస్కు లేకుండా బయటకు రాకూడదంటూ చట్టాలు చేసే పాలకులు.. తమ వరకు వచ్చేసరికి.. అసెంబ్లీ సమావేశ మందిరంలో కూడా ముఖానికి మాస్కు పెట్టుకోకుండా హాజరు కావటం దేనికి నిదర్శనం? రాష్ట్ర ప్రజలకు తమ చేతలతో వారు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారన్నది ప్రశ్న. ఇదేనా బాధ్యత?
Tags:    

Similar News