చోటా రాజన్ ఎదిగిన క్ర‌మం ఇది...

Update: 2015-11-06 16:59 GMT
చోటా రాజ‌న్‌..ఇపుడు ఈ పేరు దేశంలో మారుమోగిపోతోంది. ఏ పేప‌ర్‌లో చూసినా...ఏ టీవీ ఛాన‌ల్‌లో అయినా ఈ డాన్ వార్త‌లే హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఇంట‌ర్‌పోల్‌ను కూడా ముప్పుతిప్ప‌లు పెట్టిన ఈ మాఫియా డాన్ తాజాగా దొరికిపోయాడు. ఎట్ట‌కేల‌కు ప‌ట్టుబ‌డి దేశంలోకి వ‌చ్చిన రాజ‌న్ డాన్‌గా ఎలా ఎదిగాడు అనేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది.

రాజేంద్ర సదాశివ్ నిఖల్జే రాజ‌న్ అస‌లు పేరు. ముంబైలో ఓ సినిమా థియేట‌ర్ వ‌ద్ద పోలీసుల‌ను వారి లాఠీల‌తోనే చిత‌క‌బాద‌టంతో ఒక్క‌సారిగా తెర‌మీద‌కు రావ‌డ‌మే కాకుండా అక్క‌డి మాఫియా క‌ళ్ల‌లో ప‌డ్డాడు. స్వ‌త‌హాగా వారికి కావాల్సిన మొర‌టుత‌నం ఉండ‌టంతో అనేక మంది డాన్‌ల నుంచి రాజేంద్ర సదాశివ్ నిఖల్జే అలియ‌స్ రాజ‌న్‌కు ఆహ్వానాలు అందాయి. అయితే రాజన్ నాయర్ అలియ‌స్ బడా నాయర్ అనే పేరున్న మాఫియా డాన్ గ్యాంగును త‌న కార్య‌క్షేత్రంగా ఎంచుకున్నారు. బ‌డా రాజ‌న్ చ‌రిత్ర ఏంటంటే చిన్న‌చిన్న దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డి జైలు జీవితంలో మాఫియా డాన్‌గా మారిపోయాడు. బ‌డా రాజ‌న్ ఆహ్వానం మేర‌కు ఈ గ్యాంగులో చేరిపోయిన రాజేంద్ర నిఖల్జే అలియాస్ చోటారాజ‌న్ కొద్దికాలంలోనే ఆయ‌న‌కు నమ్మకస్తుడిగా మారాడు. బ‌డా రాజ‌న్‌ కు ద‌గ్గ‌రివాడు కావ‌డంతో, ఎత్తు త‌క్కువగా ఉండటంతో అతడిని ఛోటా రాజన్ గా పిల‌వ‌టం మొద‌లెట్టారు. అలాగే ఆయ‌న పాపుల‌ర్ అయ్యాడు.

ఇదిలా ఉంటే...బడా నాయర్ ద‌గ్గ‌ర ప‌నిచేసే కుంజు అహ్మద్ అనే అనుచ‌రుడు ఆయ‌న్ను మోసం చేశాడు. బ‌డా నాయ‌ర్ ప్రేమించిన యువతిని ఎత్తుకెళ్లిపోవ‌డ‌మే కాకుండా వేరే గ్యాంగు పెట్టుకున్నారు. త‌ర్వాతి క్ర‌మంలో కుంజు... బ‌డా నాయ‌ర్‌ను హ‌త‌మార్చాడు. దీంతో త‌న గురువును హ‌త‌మార్చ‌డాన్ని నిర‌సిస్తూ ముంబై బంద్‌కు పిలుపునిచ్చిన చోటా విజ‌యం సాధించాడు. అనంత‌రం ప‌గ తీర్చుకోవ‌డంలో భాగంగా ఊహకు అంద‌ని స్కెచ్‌లు వేశాడు.

స‌హ‌జంగా మాఫియా క‌న్నులు మ‌రో మాఫియా నాయ‌కుల క‌ద‌లిక‌ల‌పైనే ఉంటాయి. చోటా రాజ‌న్ తీరును మాఫియాడాన్ దావుద్ ఇబ్ర‌హీం కనిపెడుతున్నాడు. చోటా వ్యూహాలు న‌చ్చి త‌న డెన్ ముసాఫిర్ ఖానాకు ఆహ్వానించాడు. "ఎదిగేందుకు" (?) మ‌రో అస్త్రం దొరికింద‌నుకున్న చోటారాజ‌న్‌... దావుద్ పంచన చేరిపోయాడు. దావుద్‌తో క‌లిసి కుంజూను మ‌ట్టుబెట్టాడు. చోటా వేసిన స్కెచ్ స‌త్తా ఏంటంటే... కుంజూ అడ్డాలోనే ఆయ‌న్ను చంప‌డం! ఇలా "డీ గ్యాంగ్‌"లో కీల‌కమైన నాయ‌కుడిగా చోటా ఎదిగిపోయాడు.

అయితే ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌లేవు క‌దా. ఈ క్ర‌మంలో చోటా-దావుద్‌ల మ‌ధ్య పంప‌కాల తేడా, విబేధాలు త‌లెత్తాయి. దీంతో చోటా రాజ‌న్‌ సొంత గ్యాంగు పెట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే  దావూద్ మనుషులను చంపించాడు. దేశంలో ఉండ‌టం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని భావించ‌డంతో పాటు మాఫియా సామ్రాజ్యాన్ని విస్త‌రించుకునేందుకు స‌రైన వేదిక అని భావించి విదేశాల‌కు చెక్కేశాడు. అలా దాదాపు 27 ఏళ్ల క్రితం బార‌త్‌ను వ‌దిలిన చోటా రాజ‌న్ తాజాగా ఇంట‌ర్‌పోల్ వ‌ల్లే బాలిలో చిక్కి దేశానికి వ‌చ్చాడు. మొత్తం అతడి మీద 78 కేసులున్నాయి. ఇందులో మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులున్నాయి.

Tags:    

Similar News