చికెన్ బిర్యానీ ప్రాణమా..అయితే మీకిది చేదువార్తే

Update: 2016-04-20 22:30 GMT
చికెన్ బిర్యానీ అన్న వెంటనే నోరూరిపోవటమే కాదు.. నోటిలో నుంచి లాలాజలం ఊరటం చాలా కామన్. వేడి వేడి చికెన్ బిర్యానీని వారంలో ఒక్కసారి అయినా తినకపోతే ఏం బాగుంటుందని ఫీలయ్యే వారు చాలామందే ఉంటారు. మందు లాంటి అలవాటు లేదు కానీ.. చికెన్ బిర్యానీ తినకుండా మాత్రం ఉండలేనని చాలామంది చెబుతుంటారు. అయితే.. ఇలా గొప్పగా చెప్పుకునే వారు.. ఇకపై అలా చెప్పుకునే అవకాశం లేనట్లే. ఎందుకంటే.. చికెన్ బిర్యానీ మీద జరిపిన ఒక పరిశోధన.. షాకింగ్ విషయాల్ని బయట పెట్టింది.

లిక్కర్ తాగే అలవాటు ఉన్న వారికి తరచూ వచ్చే లివర్ సమస్యలు.. చికెన్ బిర్యానీని తరచూ లాగించే వారికీ లివర్ సమస్యలు వస్తాయన్న చేదు నిజం తాజాగా బయటకు వచ్చింది. ఇక.. చికెన్ బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ లను కలిపి తాగే వారిలో కాలేయ సమస్యలు చాలా ఎక్కువన్న విషయాన్ని తాజా రీసెర్చ్ ఒకటి తేల్చింది.

మద్యం తాగే అలవాటు లేకున్నా.. అదే పనిగా చికెన్ బిర్యానీ తినే అలవాటున్న వారు లివర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందట. ఐటీ ఉద్యోగుల్లో ఈ తరహా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు. బిర్యానీల్లో వినియోగించే వనస్పతి (డాల్డా).. నెయ్యి.. మసాలా దినుసులు.. నాణ్యత లేని మాంసం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. చికెన్ బిర్యానీ తరచూ లాగించే వారికి అకస్మాత్తుగా కడుపునొప్పి రావటం.. ఛాతి నొప్పి.. నీరసం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు. సో.. చికెన్ బిర్యానీ ఇష్టమా? అయితే.. కంట్రోల్ గా ఉండాలి సుమా.
Tags:    

Similar News