చిద్దూ భాయ్‌..ఆర్బీఐని అంత మాట అనేశారే!

Update: 2017-08-31 05:17 GMT
పి. చిదంబ‌రం... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లో సీనియ‌ర్ మోస్ట్ నేత‌గా కంటే కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు ప‌నిచేసిన నేత‌గానే మ‌న‌కు తెలుసు. ఎందుకంటే... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కేంద్ర ఆర్థిక శాస్త్ర మంత్రిగా ఆయ‌నే ఉండేవారు. మొన్న మ‌న్మోహ‌న్ సింగ్ ప‌దేళ్ల పాల‌న‌లో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక శాఖ మంత్రిగా ప‌నిచేసింది చిద్దూ భాయే. త‌మిళ‌నాడుకు చెందిన ఈ రాజ‌కీయ‌వేత్త‌... ఇప్పుడు విప‌క్షంలో ఉండ‌టంతో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. ప్ర‌ముఖ న్యాయ‌వాదిగా ఉన్న త‌న స‌తీమ‌ణి నిళిని చిదంబ‌రంతో పాటు వ్యాపార వేత్త‌గా కొన‌సాగుతున్న త‌న కుమారుడు కార్తీ చిదంబ‌రంపై లెక్క‌లేన‌న్ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. నళిని చిదంబరం విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... కార్తీ చిదంబ‌రంను గురి పెట్టిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు చిద్దూ ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంద‌ని చెప్పాలి. నిత్యం సోదాల పేరిట కార్తీ చిదంబ‌రం కంపెనీల్లో సీబీఐ - ఈడీ - ఐటీ దాడులు మోతెక్కిపోతున్నాయి. అస‌లు అనుమ‌తి లేకుండా విదేశాలకు వెళ్లరాదంటూ కూడా కార్తీకి నోటీసులు జారీ కాగా... కోర్టుకెళ్లిన ఆయ‌న దాని విష‌యంలో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.

అయినా ఇప్పుడిదంతా ఎందుకంటే... తానే టార్గెట్‌ గా త‌న కుమారుడు - భార్య‌ల‌పై విచార‌ణ‌ల‌కు బీజేపీ స‌ర్కారు  ఆదేశాలు జారీ చేస్తోంద‌న్న మాట మిన‌హా మ‌రో మాట మాట్లాడ‌లేని స్థితిలో ఉన్న చిద్దూ భాయ్‌ కి ఇప్పుడు ఓ అంశం అస్త్రంగా దొరికింది. అంతే... ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా రంగంలోకి దిగేసిన ఆయన న‌రేంద్ర మోదీ స‌ర్కారును ఏకి పారేశారు. ఒక్క మోదీ స‌ర్కారునే తిడితే ఉద్దేశ‌పూర్వ‌కంగానే తాను ఎదురు దాడికి దిగార‌నుకుంటారేమోన‌న్న భావ‌న‌తో ఆయ‌న రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పైనా విరుచుకుప‌డ్డారు. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల దేశంలో అవినీతికి చెక్ పెట్టేశామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న మోదీ స‌ర్కారు... అందులో సాధించింది శూన్య‌మేన‌ని తేలిపోయింది. ఈ ప‌థ‌కం కేవ‌లం న‌ల్ల ధ‌నాన్ని తెల్ల‌గా మార్చుకునేందుకు మాత్ర‌మే పనికి వ‌చ్చింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా లేక‌పోలేదు. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప్ర‌భుత్వానికి లాభం లేక‌పోగా.. కొత్త నోట్ల ముద్ర‌ణ పేరిట ఖ‌ర్చు త‌డిసిమోపెడైంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల వ‌చ్చిన కొద్దో గొప్పో మిగులు కాస్తా... ఈ కొత్త నోట్ల ముద్ర‌ణ‌కు వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు ప‌రిస్థితి నోట్ల ర‌ద్దుకు ముందు నాటి ప‌రిస్థితికి ఏమాత్రం భిన్నంగా లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇదే అంశాన్ని ఆస‌రా చేసుకుని నిన్న చిదంబ‌రం సోష‌ల్ మీడియా వేదిక‌గా కేంద్ర ప్ర‌భుత్వాన్ని - ఆర్బీఐని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఏకి పారేశారు. అస‌లు పెద్ద నోట్ల ర‌ద్దుకు సిఫార‌సు చేసిన ఆర్బీఐకి అస‌లు సిగ్గే లేదంటూ మొద‌లెట్టిన ఆయ‌న‌... పెద్ద నోట్ల ర‌ద్దుకు సిఫార‌సు చేసిన ఆర్బీఐ అధికారుల‌కు నోబెల్ బ‌హుమ‌తులు ఇవ్వాల‌ని కూడా సెటైర్ వేశారు. ఇక న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై గురి పెట్టిన చిద్దూ భాయ్‌... పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌భుత్వం అవినీతిని అంతం చేసేదానికి బ‌దులుగా న‌ల్ల కుబేరులంతా... త‌మ ధ‌నాన్ని తెలుపుగా మార్చుకునేందుకు చ‌క్క‌టి అవ‌కాశం క‌ల్పించింద‌ని ఆరోపించారు. ఇదెక్క‌డి పాల‌న అంటూ చిర్రుబుర్రులాడిన చిద్దూ భాయ్‌... పెద్ద నోట్ల ర‌ద్దును పెద్ద కుంభ‌కోణంగా అభివ‌ర్ణించారు.
Tags:    

Similar News