తండ్రికొడుకుల‌కు తీహార్ జైలే గ‌తి!

Update: 2017-09-23 05:38 GMT
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బీజేపీ సీనియ‌ర్ నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి. తాను ఎవ‌రినైతే టార్గెట్ చేస్తారో.. వారిని ముప్పుతిప్ప‌లు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగించటం అల‌వాటే.
సంచ‌ల‌న అంశాల్ని తెర మీద‌కు తీసుకొచ్చి.. స‌ద‌రు నేత‌ల‌కు చుక్క‌లు చూపించ‌టంలో స్వామికి పోటీ మ‌రెవ‌రూ రారు. మిగిలిన వారంతా ఒక ఎత్తు.. సొంత రాష్ట్రానికి చెందిన చిదంబ‌రం అంటే స్వామికి ఒళ్లు మంట‌. రాజ‌కీయంగా ఉన్న శ‌త్రుత్వంతో పాటు.. త‌న‌కున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని భారీ అవినీతికి చిదంబ‌రం ఫ్యామిలీ పాల్ప‌డింద‌న్న‌ది స్వామి ఆరోప‌ణ‌.

తాను చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు త‌గ్గ‌ట్లే.. చిదంబ‌రం ఫ్యామిలీకి సంబంధించిన ప‌లు అవినీతి అంశాల్ని ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. తాజాగా చిదంబ‌రం కుటుంబం మొత్తం నిజాయితీ లేని వ్య‌క్తులుగా అభివ‌ర్ణించారు స్వామి. చిదంబ‌రం ఆయ‌న కుమారుడు కార్తీ చిదంబ‌రం ఇద్ద‌రూ తీహార్ జైలుకు వెళ్ల‌టం ఖాయ‌మ‌న్నారు. కార్తీ చిదంబ‌రానికి స‌రైన విద్య లేద‌ని.. స‌రైన వ్యాపారం లేకుండానే అంత సంపద‌ను ఎలా సృష్టించార‌ని ప్ర‌శ్నించారు. చిదంబ‌రం అక్ర‌మాల‌కు పాల్ప‌డితే అత‌ని కొడుకు కార్తీ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతుంటాడ‌న్నారు. తండ్రీ కొడుకుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన స్వామి.. చిదంబ‌రం స‌తీమ‌ణి న‌ళినిని కూడా విడిచిపెట్ట‌లేదు. ఆమె కూడా అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్నారు.

చిదంబ‌రం కుటుంబ స‌భ్యులంద‌రూ నిజాయితీ లేని వ్య‌క్తుల‌ని.. కుటుంబం మొత్తాన్ని తీహార్ జైల్లో పెట్టాలంటూ నిప్పులు చెరిగారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కార్తీకి విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్దంటూ సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పిన వేళ‌లోనే చిదంబ‌రం తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.

అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కార్తీపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు విచార‌ణ సంద‌ర్భంగా విదేశాల్లో ఉన్న‌ బ్యాంకు ఖాతాల్ని మూసివేయ‌టం కోసమే కార్తీ ఫారిన్ టూర్ అని సీబీఐ ఆరోపించింది.  
ఇదే స‌మ‌యంలో చిదంబ‌రం కుటుంబం మొత్తమ్మీదా అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌టం.. నిజాయితీ లేని వ్య‌క్తులుగా స్వామి అభివ‌ర్ణించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News