కల్తీ మద్యం మరణాలపై ఆ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

Update: 2022-12-15 10:30 GMT
బీహార్‌ లో కల్తీ మద్యం తాగి 30 మంది మరణించిన ఘటన ఆ రాష్ట్రంలో అధికార జేడీయూ– ఆర్‌జేడీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బీహార్‌ అసెంబ్లీ సమావేశాల్లో కల్తీ మద్యం మరణాలు అసెంబ్లీని కుదిపేస్తున్నాయి.

వాస్తవానికి బీహార్‌ లో మద్యనిషేధం అమల్లో ఉంది. అయితే కల్తీ సారా అక్కడక్కడా ఏరులై పారుతోందని అంటున్నారు. ఈ కల్తీ మద్యాన్ని తాగి శరణ్‌ జిల్లాలో డిసెంబర్‌ 13న 21 మంది మరణించారు. అదేవిధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 9 మంది మృతి చెందారు. దీంతో విపక్షాలు నితీష్‌ కుమార్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి.

దీంతో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరైతే తాగుతారే వారే చస్తారంటూ నితీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

లిక్కర్‌ తాగే వారు చనిపోతారని నితీష్‌ వ్యాఖ్యానించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తాము పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 'బాపు ఏం చెప్పారో మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కూడా మద్యం ప్రమాదకరమని చెబుతున్నాయి. చాలా కాలంగా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా మరణిస్తున్నారు. కాబట్టి ప్రజలే నకిలీ మద్యం పట్ల ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. నిషేధం ఉన్న చోట లిక్కర్‌ అమ్ముతున్నారంటే.. అందులో ఏదో ఉన్నట్లు అర్థం. కొందరు తెలిసి తప్పులు చేస్తున్నారు.' అని నితీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ సభ్యులే తాగుబోతులని అని మండిపడ్డారు. మద్యనిషేధం గురించి బీజేపీ సభ్యులు మాట్లాడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో మద్యం మృతులపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఆయన వ్యాఖ్యలు క్షమించరాని నేరమని వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా బీజేపీ సంకీర్ణ సర్కారు నుంచి తప్పుకున్న నితీష్‌ గతేడాది ఆర్జేడీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాను జాతీయ అధికారాల్లోకి  వెళ్తానని  ఇటీవల నితీష్‌ ప్రకటించారు. తమ కూటమికి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్‌ నాయకత్వం వహిస్తారని ప్రకటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News