‘మణి’పూసకు ముఖ్యమంత్రి రూ.కోటి ఇస్తే.. ఆ సంస్థ లైఫ్ టైం ఫ్రీ పిజ్జా ఆఫర్

Update: 2021-07-25 04:30 GMT
ఈ ఆనందకరమైన వేళ.. కాసిన్ని చేదు నిజాలతో మనం వార్తలోకి వెళదాం. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించి భారత్ కు పతకాల్ని బోణీ చేసింది. యావత్ దేశం ఈ వార్తతో ఆనందోత్సాహాలకు లోనయ్యారు. అయితే.. దేశంలోని మరే ప్రాంతం లేనంత వివక్షకు ఈశాన్య రాష్ట్రాలు గురవుతుంటాయి.

 అక్కడి వారికి సరైన గుర్తింపు లభించని పరిస్థితి. విశ్వ వేదిక మీద భారత కీర్తి పతాకాన్ని సొంతం చేసుకున్నంతనే ఆమెను తమ భుజాల మీదకు ఎక్కి ఊగుతున్న దేశ ప్రజలు.. ఈశాన్య రాష్ట్రాల వారికి మరింత గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. ఈశాన్య రాష్ట్రాలన్నంతనే చిన్నచూపు చూసే ధోరణిని తగ్గించుకోవటం తప్పనిసరి. అలాంటి వారికి మాత్రమే ఈ మణిపూర్ మణిపూస సాధించిన విజయాన్ని తమ సొంతమని ఫీల్ కావటానికి హక్కు ఉంటుందన్నది మర్చిపోకూడదు.

వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి స్వర్ణాన్ని చేజార్చుకోగా.. రజతాన్ని కన్ఫర్మ్ చేసింది. స్నాచ్ లో 87 కేజీలు ఎత్తిన మీరా.. క్లీన్ అండ్ జెర్క్ లో ఏకంగా 115 కేజీలుఎత్తటం ద్వారా మొత్తం 202 కేజీల బరువుతో రజతానికి పరిమితమైంది. స్వర్ణం కోసం మూడో అటెంప్టులో ఫెయిల్ అయినా.. రెండో స్థానాన్ని సొంతం చేసుకోవటం ద్వారా ప్రపంచంలో రెండో అతి పెద్ద జనాభా ఉన్న దేశానికి ఈసారి ఒలింపిక్స్ లో తొలి పతకాన్ని అందించింది.

మీరా విజయంతో యావత్ దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె సొంత రాష్ట్రమైన మణిపూర్ లో అయితే పండుగ వాతావరణం నెలకొంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చానును అభినందించటమేకాదు.. ఏకంగా ఆమెతో వీడియో కాల్ చేసిఅభినందించారు. ఆమె విజయానికి ఈశాన్య రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలు చోటు చేసుకున్నాయి. ఈ ఆనందకర వేళలో మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ఆమెకు రూ.కోటి నజరానాను ప్రకటించారు. ఆమెతో మాట్లాడిన వేళలో.. ఆయనలోని ఆనందం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ‘ఈ రోజు అద్భుతం’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. మీరాబాయి చానుకు మరో వైరటీ బహుమానం లభించింది. ఆమె ఒలింపిక్ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత డొమినోస్ ఇండియా సంస్థ ఒక కీలక  ప్రకటన చేసింది. మీరాబాయి చానుకు లైఫ్ టైం ఫ్రీ పిజ్జా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ మేరకు ప్రకటన చేసింది. అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మీరాబాయి తనకు పిజ్జా తినాలని ఉందని.. కఠోర శిక్షణలో భాగంగా తానుచాలా కాలంగా పిజ్జా తినలేదని..

అందుకే తాను పిజ్జా తినాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఒలింపిక్ పతకాన్ని సొంతం చేసుకున్నంతనే స్పందించిన డొమినోస్.. ‘‘మీరాబాయి చాను చెప్పారు. మేము విన్నాము. మీరాబాయి చాను పిజ్జా తినేందుకు వేచి ఉండాలని మేం కోరుకోవటం లేదు. అందుకే తనకు ఉచిత డొమినోస్ పిజ్జాను జీవితాంతం అందిస్తున్నాం’’ అంటూ ప్రకటించింది. మరెన్ని కంపెనీలు ఇంకెన్ని నజరానాలు ప్రకటిస్తాయో చూడాలి. 






Full ViewFull View
Tags:    

Similar News