సెంటిమెంట్ కు దూరంగా గులాబీ బాస్.. ఇదేం లెక్క సారూ?

Update: 2023-01-18 08:51 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ అన్నంతనే గుర్తుకు వచ్చే అంశాల్లో.. ఆయన సెంటిమెంట్లు కూడా. కొన్ని విశ్వాసాల విషయంలో ఆయన ఎంత కచ్ఛితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతకాలు.. మహుర్తాలకు పెద్దపీట వేసే ఆయన.. మిగిలిన వారు ఎవరేమన్నా.. తాను నమ్మిన దాని గురించి అస్సలు ఆలోచించరు. అలాంటి కేసీఆర్ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు నమ్మిన నమ్మకాలకు భిన్నంగా ఆయన అడుగులు పడుతున్నాయి. అందుకు తాజాగా నిర్వహిస్తున్న ఖమ్మం బహిరంగ సభ ఒక నిదర్శనంగా చెబుతున్నారు.

ఉద్యమ కాలం నాటి నుంచి కేసీఆర్ నిర్వహించే బహిరంగ సభలకు భారీ కసరత్తు ఉంటుంది. తెలంగాణ సెంటిమెంట్ ను రాజేందుకు వీలుగా బహిరంగ సభల్ని నిర్వహించేవారు. అంతేకాదు.. ప్రతి బహిరంగ సభకు ఒక టైటిల్ పెట్టేసి.. ఆ సభను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవారు. ఆ అలవాటును తాజ ప్రస్తుతం పక్కన పెట్టేశారు.

తాజాగా నిర్వహిస్తున్న ఖమ్మం బహిరంగ సభకు అలాంటి టైటిల్ ఏమీ లేకపోవటం గమనార్హం. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ భారీ కార్యక్రమానికి.. కేసీఆర్ మార్క్ గా ఉండే ప్రత్యేకమైన పేరు లేకపోవటం పెద్ద లోటేనని చెబుతున్నారు.

ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కు కొన్ని సెంటిమెంట్లను పక్కగా ఫాలో అవుతుంటారు. తాను తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని అయినా సరే కరీంనగర్ నుంచి షురూ చేస్తుంటారు. కరీంనగర్ తనకు అచ్చివచ్చిన ఊరుగా చెబుతుంటారు. అలాంటి సెంటిమెంట్ కు భిన్నంగా తన జాతీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కరీంనగర్ లో కాకుండా ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. ఈ సభతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయటం లక్ష్యమని గులాబీ నేతలు చెబుతున్నా.. కరీంనగర్ సెంటిమెంట్ ను కాదనుకోవటం సరికాదన్న మాట వినిపిస్తోంది.

ఇక.. కేసీఆర్ కు 'ఆరు' నెంబరుకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2018లో షెడ్యూల్ కంటే ఎన్నికలకు వెళ్లటానికి ఆయన తన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసుకోవటానికి సైతం ఆరు సంఖ్య వచ్చేలా డేట్ ను డిసైడ్ చేసుకోవటం.. ఆయన సెంటిమెంట్ ఫలించి మరోసారి ప్రభుత్వాన్నిఏర్పాటు చేయటం తెలిసిందే. తాజా బహిరంగ సభ జరుగుతున్న రోజును చూస్తే.. 18-01-2023.

దీన్నిమొత్తం కలిపితే.. 8+1+1+2+2+3= 17 (1+7=8) సభ జరుగుతున్న ఈ రోజు (బుధవారం)తేదీలోని సంఖ్యలన్నింటిని కలిపితే వచ్చే అంకె '8'. సాధారణంగా ఇలాంటి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సభల కోసం ఆరు అంకె వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతారు. దానికి భిన్నంగా కేసీఆర్ వ్యవహరించటం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని సెంటిమెంట్ లకు భిన్నంగా సాగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News