పీకే ఇక చాలు... కేసీయార్ కి అసలు నచ్చట్లే...?

Update: 2022-09-22 13:30 GMT
తెలంగాణాలో మరోసారి టీయారెస్ ని అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి తన బుర్రను వాడేందుకు ప్రశాంత్ కిశోర్ అనబడే పీకే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. జగమెరిగిన రాజకీయ వ్యూహకర్తగా పీకే ఇప్పటికే  ఎస్టాబ్లిష్ అయ్యారు.

ఆయన పట్టుకున్నది బంగారం అవుతోంది. ఆయన చేపట్టిన పార్టీ సింహాసనం ఎక్కేస్తోంది. దాంతో ఎందుకైనా మంచిదని మోజు పడి ముచ్చట పడి పీకే ఐ ప్యాక్ టీం తో కలసి  టీయారెస్ ఈసారి ఎన్నికల గోదావరి ఈదాలని చూసింది.

అయితే ఎందుకో పీకే టీం పనితీరు పట్ల గులాబీ బాస్ కొంతకాలంగా సంతోషంగా లేరు అనే అంటున్నట్లుగా రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున  గుసగుసలు వినిపిస్తున్నాయి. పీకే టీం తెలంగాణాలో టీయారెస్ గెలుపు కొరకు  కొత్తగా స్ట్రాటజీలు ఏవీ రచించడంలేదని, ముఖ్యంగా బీజేపీని నిలువరించే విషయంలో పేకే వ్యూహాలు మరీ  పేలవంగా ఉన్నాయని కేసీయార్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారుట.

ఇక పీకే టీం సేవలను ప్రస్తుతానికైతే మునుగోడు ఉప ఎన్నికల దాకానే ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావవంతమైన  వ్యూహాలేవీ పీకే టీం నుంచి రావడంలేదని అంటున్నారు. పీకే టీం ఈ విషయంలో ఎందుకో తగిన విధంగా పనిచేయడంలేదని టీయారెస్ అగ్ర నాయక‌త్వం  అయితే భావిస్తోంది అని ప్రచారం అయితే షికారు చేస్తోంది.

ఇక పీకే టీం విషయానికి వస్తే తెలంగాణాలో ఉన్న తన ఐ ప్యాక్ టీం ని రెండు నెలల తరువాత పూర్తిగా ఆంధ్రాకు తరలిస్తుంది అన్న ప్రచారం కూడా సాగుతోంది అంటున్నారు. ఆంధ్రాలో పీకే టీం అధికార వైసీపీకి రాజకీయ  వ్యూహకర్తగా ఉంటోంది.

దాంతో 2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి 2025లో బీహార్ లో జరిగే ఎన్నికల్లో జేడీయూకు పీకే టీం వ్యూహకర్తగా పనిచేస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి పీకే టీం ముందు ఉన్న రెండు భారీ ప్రాజెక్టులు ఇవే అంటున్నారు. వీటి మీదనే ఇక పైన పూర్తి ఫోకస్ పెడుతుంది అని చెబుతున్నారు. చూడాలి మరి ఈ వార్తలలో నిజానిజాలు ఏమిటన్నవి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News