ఏపీలో కేసీయార్ ఉక్కు పిడికిలి...మిత్ర శత్రువులను తేల్చేసే వ్యూహం

Update: 2023-01-20 02:30 GMT
కేసీయార్ రాజకీయ చాణక్యుడు. ఆయన రాజకీయాలను ఔపాసన పట్టేశారు అని చెప్పాలి. ఎక్కడకి వెళ్తే అక్కడ స్థానిక పరిస్థితులు ప్రధానంగా ఎమోషనల్ టచ్ ఇచ్చే ఇష్యూస్ ని పట్టుకోవడంలో ఘనాపాటి. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజా సమస్యలనే ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎమోషనల్ ఇష్యూస్ జోలికి పెద్దగా వెళ్లరు.

ఎందుకంటే వాటి విషయంలో రిస్క్ ఉంటుంది. అవి అనుకున్న విధంగా ప్రెజెంట్ చేయకపోయినా ఒక్కసారి చెలరేగిన ఉద్యమాన్ని కంట్రోల్ లో ఉంచుకోకపోయినా రివర్స్ అవుతుంది. టోటల్ గా దెబ్బ పడుతుంది. కానీ కేసీయార్ అతి పెద్ద ఎమోషనల్ ఇష్యూ అయిన తెలంగాణానే సక్సెస్ ఫుల్ గా డీల్ చేసి రాష్ట్రాన్ని సాధించారు. దాంతో ఆయనకు మిగిలిన ఎమోషనల్ ఇష్యూస్ అంత పెద్దవి కావు అనే చెప్పాలి.

ఇక ఏపీలో బీయారెస్ ని విస్తరించాలి అని చూస్తున్న కేసీయార్ అందివచ్చిన అవకాశాలను వాడుకుంటున్నారు అనే అంటారు. ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉంది. నిజానికి దీని కంటే  మరో ఎమోషనల్ ఇష్యూ గా ప్రత్యేక హోదా ఉంది. కానీ కేసీయార్ దాని సంగతి తరువాత చూస్తారు. అది కూడా ఆయన అజెండాలో ఉంది.

కానీ ముందు స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీదనే ఆయన ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించిన హింట్ కూడా ఆయన ఖమ్మంలో జరిగిన సభలో ఇచ్చేశారు.  బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే మాది నేషనలైజేషన్ అంటూ కేసీయార్ బీయారెస్ పాలసీని చాటారు. మరి అందులో భాగంగా ఆయన తొందరలో విశాఖలో సభ పెట్టబోతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఆయన సభలో హై లెట్ అవుతుంది అని అంటున్నారు. నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కుగా ఉంది. ఈ ప్లాంట్ సాధన కోసం నాడు ఉమ్మడి ఏపీలో ఎంతో మంది త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు. వారిలో తెలంగాణాకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇపుడు అదే కేసీయార్ కి కలసిరాబోతోంది. ఉమ్మడి ఏపీ అంతా మద్దతుగా నిలిచి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తారు అని బీజేపీని కచ్చితంగా కేసీయార్ విశాఖ గడ్డ మీద నుంచి నిగ్గదీస్తారు అని అంటున్నారు.

ఇక ఏపీలో పాలిటిక్స్ చూస్తే అధికార వైసీపీ కానీ విపక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేన కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్దగా పట్టించుకోవడంలేదు. బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో అని మౌనంగా ఉంటున్నాయి. దాంతో బంగారం లాంటి స్టీల్ ప్లాంట్ కాస్తా ప్రైవేట్ పరం అవుతోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ప్రభుత్వ రంగంలోకి స్టీల్ ప్లాంట్ ని తెస్తామని కేసీయార్ ఒక్క మాట కూడా చెప్పనున్నారు.

దాంతో ఆయనకు విశాఖలో మంచి మద్దతు దక్కుతుంది అని అంటున్నారు. అదే టైం లో స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల వైఖరి ఏంటి అన్నది కూడా తేలుతుంది అని అంటున్నారు. ఇక కేసీయార్ ఏపీ ఎంట్రీ అంతా కూడా వైసీపీ సహకారంతోనే సాగుతుంది అని అంటున్నారు.  పైగా కేసీయార్ తెలుగుదేశం జనసేనల ప్యాకెట్స్  మీదనే గురి పెట్టి కొడుతున్నారు. దాంతో ఆ రెండు పార్టీలు కేసీయార్ స్టీల్ ప్లాంట్ పోరాటానికి ఎంతవరకూ మద్దతు ఇస్తాయని అన్నది చూడాలి.

ఇక ఎవరు మద్దతుగా నిలిచినా లేకపోయినా ఏపీలో మాత్ర కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అయితే కేసీయార్ కి మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక కేసేయార్ అయితే ఒక వైపు బీజేపీని టార్గెట్ చేస్తూనే మరో వైపు ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల వైఖరిని కూడా పూర్తి స్థాయిలో ఎండగడతారు అని అంటున్నారు. చూడాలి మరి కేసీయార్ దూకుడుతో ఏపీలో ఆయనకు మిత్రులు ఎవరు శత్రువులు ఎవరో తేలిపోతుంది అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News