జయరాం హత్యకేసు మిస్టరీ వీడింది..

Update: 2019-02-03 07:05 GMT
ప్ర‌ముఖ ప్ర‌వాసాంధ్రుడు, బ‌డా పారిశ్రామిక‌వేత్త చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడెవ‌ర‌న్న‌ది దాదాపుగా తేలిపోయింది. జ‌య‌రాం మేన‌కోడ‌లుతో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపిన‌ట్టుగా భావిస్తున్న రాకేశ్ అనే వ్య‌క్తి జ‌య‌రాంను హ‌త్య చేసిన‌ట్టుగా పోలీసులు ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అంతేకాకుండా జ‌య‌రాంను రాకేశ్ ఎలా చంపార‌న్న విష‌యంపైనా వారు ఓ అంచ‌నాకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే రాకేశ్ ను అదుపులోకి తీసుకున్నార‌ని, ర‌హ‌స్య ప్ర‌దేశంలో అత‌డిని విచారిస్తున్నార‌ని ఓ వైపు, అస‌లు అత‌డు ఇప్ప‌టిదాకా పోలీసుల‌కే చిక్క‌కుండా త‌ప్పించుకున్న‌ట్లుగా మ‌రో వైపు భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఏ వాద‌న క‌రెక్టో తెలియ‌దు గానీ... జ‌య‌రాంను హ‌త్య చేసింది మాత్రం అత‌డేన‌ని దాదాపుగా నిర్ధార‌ణ అయిపోయిన‌ట్టేన‌ని కూడా పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కేసు ద‌ర్యాప్తులో నిన్న రాత్రి నుంచి కీల‌క  ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుల‌ను సీన్ నుంచి త‌ప్పించేందుకు భారీ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా వినిపిస్తున్న వార్త‌లు ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారిపోయాయి. అస‌లు విష‌యాల‌ను ఇప్ప‌టికిప్పుడే వెల్ల‌డించ‌వ‌ద్ద‌ని పోలీసుల‌పై అటు రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, స‌మాజంలో మంచి పేరు ప్ర‌తిష్ఠ‌లు ఉన్న వ్య‌క్తులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్లుగా కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ వార్త‌ల‌న్నీ నిజ‌మేన‌న్న కోణంలో ప‌లు ఘ‌ట‌న‌ల‌ను ఉద‌హ‌రిస్తున్న వైనం కూడా సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఈ కేసులో ఆది నుంచి కీల‌క పాత్ర‌ధారిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌య‌రాం మేన‌కోడ‌లు శిఖా చౌద‌రిని అస‌లు విచార‌ణ‌లో నుంచే త‌ప్పించేందుకు తెర వెనుక పెద్ద తతంగ‌మే న‌డుస్తోంద‌ని, ఈ క్ర‌మంలోనే ప‌లువురు పెద్ద‌లు రంగంలోకి దిగిపోయార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే శిఖాను పోలీసులు త‌మ అదుపులోకి తీసుకున్నార‌ని, నందిగామ పోలీస్ స్టేష‌న్ లో విచారిస్తున్నార‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంపై పోలీసులు చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. శిఖా చౌద‌రిని తాము అదుపులోకి తీసుకున్నామ‌న్న విష‌యంపై నోరు విప్ప‌ని పోలీసులు... ఆ వార్త‌ల‌ను ఖండించడం కూడా లేదు. దీంతో అస‌లు శిఖా చౌద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా?  లేదా? అనుమానాలు కూడా ఇంకా నివృత్తి కాలేద‌నే చెప్పాలి. అయితే శిఖా చౌద‌రి పోలీసుల అదుపులోనే ఉన్నార‌ని, ఆమె కారు నందిగామ పోలీస్ స్టేష‌న్ లోనే ఉంద‌ని, ఈ కారును అక్క‌డికి వ‌చ్చిన ఓ ప్ర‌ముఖుడు తీసుకెళ్లిపోయాడ‌న్న వార్త‌లు ఒక్క‌సారిగా గుప్పుమ‌న్నాయి.

తెలుగు చిత్ర సీమ‌కు చెందిన ప్రముఖ నిర్మాత ఒక‌రు నేరుగా నందిగామ పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి అక్క‌డ ఉన్న శిఖా చౌద‌రి కారును తీసుకెళ్లిపోయార‌ట‌. అయితే ఆయ‌న‌ను అడ్డ‌గించేందుకు అక్క‌డి పోలీసులు ఒక్క‌రు కూడా య‌త్నించిన దాఖ‌లా లేద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మాజంలో స‌ద‌రు నిర్మాత‌కు ఉన్న ప‌లుకుబ‌డి నేప‌థ్యంలోనే పోలీస్ స్టేష‌న్ లో ఉన్న కారును పోలీసుల అనుమ‌తి లేకుండానే ఆయ‌న తీసుకెళ్లిపోతున్నా.. పోలీసులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ ఘ‌ట‌న కేసుపై ఒక్క‌సారిగా ప‌లు అనుమానాల‌ను రేకెత్తించింద‌నే చెప్పాలి. జ‌య‌రాంను హ‌త్య చేసింది రాకేశేన‌ని తేలిపోయినా... అస‌లు ఈ హ‌త్య‌కు అత‌డికి శిఖా చౌద‌రి స‌హ‌క‌రించి ఉంటార‌ని, అయితే ఈ కేసు నుంచి ఆమెను తప్పించేందుకే ప‌క్కా వ్యూహం జ‌రిగిపోయింద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌య‌రాంను పొట్ట‌న‌బెట్టుకున్న దుర్మార్గుడు ఎవ‌ర‌న్న విష‌యం తేలినా... ఈ హ‌త్య‌కు దారి తీసిన అస‌లు కార‌ణాలు, అస‌లు నిందితులు సేఫ్ అయిపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News