కూటమి నేతలకు బాబు మార్కు స్మూత్ & స్ట్రాంగ్ వార్నింగ్!
ఈ విషయంలో ఇలాంటి పనికి ఎవరు పూనుకున్నా ఉపేక్షించేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.
సొషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇలాంటి పనికి ఎవరు పూనుకున్నా ఉపేక్షించేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతోన్న విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు మండి పడుతున్నాయి. ఇందులో భాగంగా.. వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారని, అలాంటి పనికి పూనుకుంటున్న పోలీసులను పిలిపిస్తామని చెబుతున్నారు.
ఈ సందర్భంగా శాసనసభలో బడ్జెట్ పై మాట్లాడుతూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించమని.. మహిళలను కించపరిచేలా కూటమి నేతలు ఎవరూ పోస్టులు పెట్టరని.. పెట్టించబోరు అని అన్నారు. ఒకవేళ అదే జరిగితే సొంతవాళ్లని కూడా చూడకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
ఇదే సమయంలో... గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ జరిగిందని.. ఈ క్రమంలో వ్యవస్థలను నాశనం చేశారని.. వైసీపీ చేసిన తపులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని.. అమరావతి గొప్ప నగరంగా తయారుకాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారని.. పోలవరాన్నీ దెబ్బతీశారాని బాబు విమర్శించారు.
అదేవిధంగా... రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చిన చంద్రబాబు.. విభజన నష్టం కంటే గత ఐదేళ్లలో జరిగిన నష్టం ఎక్కువని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో.. గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేశారని.. మధ్యంపైనా అవినీతి చేశారని.. అప్పులు తెచ్చారని.. చెత్తపైనా పన్నులు వేశారంటూ బాబు దుయ్యబట్టారు.