ఏపీలో ఇండియా కూటమికి వైసీపీ నాయకత్వం ?

కాంగ్రెస్ పార్టీతో ఏపీలో పొత్తులకు వైసీపీ చూస్తోందా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అని అంటున్నారు.

Update: 2024-12-24 02:30 GMT

కాంగ్రెస్ పార్టీతో ఏపీలో పొత్తులకు వైసీపీ చూస్తోందా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అని అంటున్నారు. ఏపీలో మూడు పార్టీలు కలసి ఎన్డీయే ప్రభుత్వాన్ని నడపగా లేనిది విపక్షంలో ఉన్న నాలుగు పార్టీలు కలవకుండా ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. ఇది రాజకీయ అనివార్యత అని అంటున్నారు.

దీని మీద అనేక మంది అయితే ప్రజాస్వామ్యంలో ఏదీ అసాధ్యం కాదు అని అంటున్నారు. ఏపీలో జగన్ నాయకత్వంలో వైసీపీ ఓటమి పాలు అయినా 40 శాతం ఓటు బ్యాంక్ తో ఉంది. ఇక అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కలసికట్టుగా వస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది.

అయితే ఈసారి అలా జరిగితే దెబ్బ తినేది వైసీపీయే అని అంటున్నారు. ఇప్పటికే కూటమిలోని మూడు పార్టీలు మళ్లీ ఎన్నికల్లో కూడా కలసి పోటీకే అని చెబుతున్నాయి. దాంతో వైసీపీ కూడా పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయి. దేశంలో చూస్తే రెండు జాతీయ కూటములు ఏర్పాటు అయ్యాయి. ఎన్డీయే కూటమిలో ఏపీలోని జనసేన టీడీపీ ఉన్నాయి. మరి ఇండియా కూటమిలోనూ ఎన్డీయే కూటమిలోనూ లేనిది వైసీపీ మాత్రమే. అదే జరిగితే ఎన్డీయే వ్యతిరేక కూటమి అయిన ఇండియా కూటమిలో చేరి ఏపీలో ఇండియా కూటమికి వైసీపీ నాయకత్వం వహిస్తుంది అని అంటునారు.

అయితే దీనిని ఎంత వరకూ అవకాశాలు ఉన్నాయని చూస్తే చాలా వరకూ అని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ భావజాలం ఉంది అదంతా వైసీపీలోనే ఉంది అని కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్యూలో చెప్పారు. ఎన్డీయేను ఎదుర్కోవడానికి ఏపీలో కూడా పొలిటికల్ పోలరైజేషన్ తప్పదని ఆయన అంటున్నారు.

ఇక వైసీపీలో చూస్తే కాంగ్రెస్ వల్ల కూడా తమకు కంచుకోటలు అయిన రాయలసీమ జిల్లాలలో ఓటమి పలుకరించింది అని విశ్లేషించుకుంటోంది. ఇపుడు చూస్తే వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ విషయంలో వైసీపీ గట్టిగా నిలబడింది. అలాగే కొన్ని ఇష్యూస్ విషయంలో వైసీపీ ఇండియా కూటమి విధానాలు ఒకటిగా ఉంటున్నాయి.

అయితే కొన్ని షరతులతోనే ఇండియా కూటమిలోని వెళ్ళాలని జగన్ చూస్తున్నారు అని ఒక ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ తనకు అనుకూలమైన వారిని నియమించాలని కండిషన్లు పెడతారు అని అంటున్నారు. అలాగే ఏపీలో ఇండియా కూటమికి వైసీపీ నాయకత్వం వహిస్తుందని కాంగ్రెస్ కి వామపక్షాలకు వైసీపీ పొత్తులలో భగంగా సీట్లు ఇస్తుందని అంటున్నారు.

ఏపీలో ఇండియా కూటమి గెలిస్తే పెద్దన్న పాత్రలో వైసీపీ ఉంటుందని వైసీపీదే కీలక పాత్రగా ఉంటుందని చెబుతున్నారుట. వీటి మీద కనుక స్పష్ట వస్తే ఇండియా కూటమిలోకి వైసీపీ వెళ్ళడం జరుగుతుంది అని అంటున్నారు మరీ ముఖ్యంగా తన మీద విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న షర్మిలను పీసీసీ చీఫ్ నుంచి తప్పించడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

అలాగే ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ ఒప్పుకుంటేనే కూడా ఇండియా కూటమిలో చేరడానికి అభ్యంతరం లేదని వైసీపీ అధినాయకత్వం చెప్పింది అని అంటున్నారు. బెంగళూరు లో కాంగ్రెస్ సీనియర్లతో ఈ ప్రతిపాదనలు జగన్ పెట్టినట్లుగా పుకార్లు అయితే షికారు చేస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ సీనియర్లు అంతా వైసీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికి మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఒక్క సీటూ దక్కలేదు. ఈసారి అలా కాకుండా ఉండాలి అంటే వైసీపీతో పొత్తు ఉండాల్సిందే అంటున్నారు.

ఇలా పుకార్లుగా వస్తున్న ఈ వార్తలలో నిజం ఎంత ఉందని తెలియాలంటే కొత్త ఏడాది వరకూ ఆగాల్సిందే అంటున్నారు. చూడాలి మరి 2025లో ఏపీ రాజకీయాల్లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే అంటున్నారు. ఏపీలో రాజకీయ సంచలనాలకి కూడా వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News