సినీ నటీనటులకు చీకోటి చెల్లింపుల లెక్కే వేరు.. ఎవరెవరికి ఎంతంటే?

Update: 2022-07-29 03:53 GMT
క్యాసినో పేరుతో భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు సంబంధించిన లెక్కల్ని తేల్చే పనిలో బిజీగా ఉన్నారు ఈడీ అధికారులు. బుధవారం ఉదయం నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత వరకు చీకోటి ప్రవీణ్.. అతని ఏజెంట్ గా వ్యవహరించిన మాధవరెడ్డితో పాటు పలువురు నివాసాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నేపాల్ లో నిర్వహించిన భారీ ఈవెంట్ సందర్భంగా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లుగా చెబుతున్నారు.

అతను నిర్వహించిన కార్యక్రమాల్లో గత నెల (జూన్) 10 నుంచి నాలుగు రోజుల పాటు నేపాల్ లో నిర్వహించిన క్యాసినో నిర్వహణలో భాగంగా ఎంటర్ టైన్ మెంట్ పేరుతో పలువురు బాలీవుడ్ నటీనటులను రప్పించటం.. వారికి భారీగా చెల్లింపులు జరపటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో బాగంగా సినీ సెలబ్రిటీలకు భారీగా పారితోషికాలు ఇచ్చిన వైనాన్ని ఈడీ గుర్తించింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలీవుడ్ నటీనటులకు చీకోటి ప్రవీణ్ జరిపిన చెల్లింపుల వైనంపై ఈడీ అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లుగా ఒకప్పుడు వెలిగిన మల్లికా శెరావత్ కు రూ.కోటి.. అమీషా పటేల్ కు రూ.80లక్షలు.. డింపుల్ హయతీకి రూ.40 లక్షలు.. గోవిందాకు రూ.50 లక్షలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇక.. టాలీవుడ్ నటి ఇషా రెబ్బకు రూ.40 లక్షలు.. గణేష్ ఆచార్యకు రూ.20లక్షలు.. ముమైత్ ఖాన్ కు రూ.15 లక్షల చొప్పున పారితోషికాన్ని ఇచ్చినట్లుగా ఈడీ వద్ద ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే క్యాసినో నిర్వహణతో హవాలా మార్గంలో సొమ్ము తరలించేందుకు చీకోటితో పాటు మరో నలుగురు పార్టనర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికిక సంబంధించిన వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే.. ఈ నలుగురిలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు.. బెంగళూరుకు చెందిన ఒకరు.. చెన్నైకి చెందిన మరొకరు ఉన్నట్లు చెబుతున్నారు.

వీరికి సంబంధించిన వివరాల్ని లెక్క తేల్చే పనిలో  ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. సోదాల్లో భాగంగా లభించిన డాక్యుమెంట్లు.. హార్డ్ డిస్క్ నుంచి వివరాల్ని రిట్రీవ్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు చీకోటి శ్రీలంక.. నేపాల్.. గోవాల్లో క్యాసినో నిర్వహించినట్లు చెబుతున్నా.. సోదాల సందర్భంగా అతగాడు సింగపూర్.. మలేషియా.. థాయ్ లాండ్.. ఇండోనేషియా లలో కూడా కార్యకలాపాలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఈడీ అధికారులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News