చీకోటి లైఫ్ స్టైల్ ఒక పట్టానా అర్థం కాదు.. బర్త్ డే పార్టీకి రూ.కోటి

Update: 2022-07-29 04:09 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారారు చీకోటి ప్రవీణ్. తాజాగా ఈడీ సోదాల నేపథ్యంలో అతగాడి వ్యవహారాలకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు.. పలు విభాగాలకు సంబంధించిన అధికారులు అతడికి ఎంతో సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు.

ఇతగాడికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని బయటకు తీస్తున్న కొద్దీ విస్మయానికి గురి చేసే అంశాలెన్నో బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. విలువైన రేంజ్ రోవర్ కారును వాడే అతగాడు ఉండే నివాసం మాత్రం.. అతడి కారు విలువ కంటే తక్కువగా ఉన్న ఇంట్లో కావటం విశేషం. సైదాబాద్ లోని వినయ్ నగర్ కాలనీలోని సాయి కిరణ్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ మొదటి అంతస్తులోని ఒక ప్లాట్ లో ఉంటాడు.

గత ఏడాది రూ.6 కోట్లతో ఒక ఖరీదైన భవంతిని కొనుగోలు చేసి.. దాని వాస్తు లెక్క సరిగా లేదన్న కారణంగా పెద్ద ఎత్తున మార్పులు చేయించి.. గ్రహప్రవేశం కూడా చేశారు. కానీ.. నివాసం మాత్రం పాత ఇంట్లోనే కావటం విశేషం. దీనికి కారణం.. తనకు కలిసి వచ్చిన ఇంట్లో ఉంటే అంతా బాగుంటుందన్న ఆలోచనే కారణంగా చెబుతారు. ఇలా.. ఇతగాడి లైఫ్ స్టైల్ రోటీన్ కు భిన్నమని చెబుతారు. ఏడాదికి.. ఏడాదిన్నరకు కొత్త కారును మార్చే ఇతడు.. కారు ఏదైనా దాని నెంబరు మాత్రం ''444'' ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతారు.

సాదాసీదా ఇంట్లో ఉన్నా.. ఖరీదైన జీవితాన్ని.. విలాసవంతంగా అతగాడి జీవనశైలి ఉంటుందని చెబుతారు. కడ్తాల్ లోని ఫామ్ హౌస్ లో విదేశీ జంతువులకు సంబంధించిన పలు వన్య ప్రాణుల్నిపెంచుకోవటమే కాదు.. వీటి పోషణకు నెలకు లక్షలాది రూపాయిలు ఖర్చు చేయటం అతగాడి హాబీల్లో ఒకటిగా చెబుతుంటారు. సైదాబద్ లోని తన పాత ఇంట్లో ప్రవీణ్ ఉన్నప్పటికీ.. అతడి ఇంటికి మాత్రం వచ్చే ఖరీదైన కార్లు.. అతడికున్న పరిచయాలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయాన్ని చెబుతుంటాయి. సాధారణంగా అతగాడి ఇంటికి వచ్చే ప్రముఖులు.. సంపన్నుల్ని చూస్తే.. అతడి ఇంటికే నేరుగా రావటం చూస్తేనే.. అతడి స్థాయి ఏమిటో ఇట్టే అర్థమవుతుందంటారు.

దాదాపు పదేళ్ల క్రితం ప్రవీణ్ ఇంట్లో బర్త్ డే పార్టీని ఘనంగా నిర్వహించటమే కాదు.. దాని కోసం ఏకంగా రూ.కోటి ఖర్చుచేసిన వైనం అప్పట్లో హాట్ టాపిక్ గా మారినట్లు చెబుతారు. అంతేకాదు.. తాను నివసించే ప్రాంతంలోని యూత్ నుంచి ఎవరు వచ్చి సాయం అడిగినా కాదనకుండా ఇస్తారని చెబుతారు.వినాయకచవితి.. బోనాలు.. లాంటి వాటికి పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం అతనికో అలవాటుగా చెబుతారు. ఆలయాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం.. యూత్ నిర్వహించే పోటీలకు ఆర్థిక సాయం చేస్తుంటాడని చెబుతారు.

ఇక.. అతగాడి అతిధ్యాన్ని ఒకసారి రుచి చూసిన తర్వాత అతన్ని మర్చిపోవటం సాధ్యం కాదంటారు.. వీఐపీలు.. పోలీసు అధికారులు.. తదితరలు అతడి దావత్ కు క్యూ కడతారన్న ప్రచారం ఉంది. గోవా.. శ్రీలంక..నేపాల్ లాంటి చోట్లకు తాను నిర్వహించేక్యాసినోలకు వచ్చే వారే కాదు.. ఆయా ప్రాంతాలకు వెళ్లే అధికారులు.. వీఐపీల సమాచారం తెలిసినంతనే.. వారికి అవసరమైన అన్ని సేవల్ని సిద్దం చేస్తారని.. అందుకు అయ్యే భారీ ఖర్చును తానే భరిస్తారని.. తన తీరుతో వారిని ఫిదా చేయటంలో అతడికి అతడే సాటి అని చెబుతారు. ఈ కారణంతోనే అతను అందరికి సన్నిహితంగా ఉండటమే కాదు.. అతడి అతిధ్యాన్ని అస్సలు మర్చిపోలేరని చెబుతుంటారు. చీకోటి ప్రవీణ్ దావత్ లెక్కలే వేరన్న మాట అతడి సన్నిహితుల నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది.
Tags:    

Similar News